ముత్తువాళ్లూరును వణికిస్తున్న ఏనుగులు
గుడిపాల: ఏనుగుల గుంపు బుధవారం తెల్లవారుజామున గుడిపాల మండలంలోని ముత్తువాళ్లూరు గ్రామ సమీపంలోని పంటలపై పడ్డాయి. కొబ్బరి, మామిడి చెట్లను విరిచేశాయి. వరి పంటను తొక్కి నాశనం చేశాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు గ్రామానికి రెండువైపులా వెళ్లి పొలాలపై స్వైర విహారం చేశాయని గ్రామస్తులు వాపోయా రు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని టపాకాయలు పేల్చ డంతో కొంతసేపు పొలాల్లోనే మిన్నకుండిపోయాయి. తర్వాత పొలాలకు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్, పైపులను విరగొట్టాయి. 20 రోజులుగా ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని, అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని వాటిని ఇతర ప్రాంతాలకు తరిమేయాలని రైతులు కోరుతున్నారు.
ఏనుగుల గాలింపు కోసం 20 మంది సిబ్బంది
ఏనుగుల గాలింపు కోసం 20 మంది సిబ్బందిని నియమించినట్టు అటవీశాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరణ్‌సింగ్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు ఆదేశాల మేరకు ఏనుగులను తమిళనాడుకు తరలించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు ఏపుగా పెరిగినందు వల్ల ఏనుగుల జాడను కనిపెట్టలేకపోతున్నామని, ప్రస్తుతం అటవీమార్గంలో రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో డ్రోన్ల ద్వారా వాటిని గుర్తిస్తామన్నారు. ఇందులో భాగంగా 20 మందితో చిత్తపార అటవీప్రాంతాన్ని గాలిస్తున్నట్టు వివరించారు.
ముత్తువాళ్లూరును వణికిస్తున్న ఏనుగులు


