చిత్తూరు కోర్టులో ఉద్యోగాలకు 30 వరకు గడువు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఉత్తర్వులు జారీ చేశారు. రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ మూడు పోస్టుల భర్తీ కోసం ఈనెల 27 వరకు గడువు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో 30వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. దరఖాస్తులను పోస్టు ద్వారా మాత్రమే అందజేయాలని సూచించారు.
సిద్ధార్థలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
నారాయణవనం: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు నిర్వహించే సిల్వర్ జూబ్లీ సావనీర్‌ను కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. బుధవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి అశోకరాజు దంపతులు రుత్వికులు గణపతి, సరస్వతి, సుదర్శన హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో ప్రతి రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఇన్నోవేషన్లపై ప్రాజెక్ట్, పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, క్రీడల పోటీలు, అకడెమిక్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, అవార్డులు, నృత్య ప్రదర్శనలు ఉంటాయని అశోకరాజు తెలిపారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో 24 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ ఇందిరవేణి, డైరెక్టర్ చాందిని, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళను మోసగించిన వ్యక్తిపై
కేసు నమోదు
బంగారుపాళెం : కూరగాయల వ్యాపారం చేసుకునే మహిళను మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని దిగువబందార్లపల్లెకు చెందిన దేవేంద్ర భార్య శారదమ్మ బంగారుపాళెంలోని ఓంశక్తి ఆలయం వద్ద కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన తిరుపతికి చెందిన రాకేష్ అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చి రూ.లక్ష లోన్ తీసిస్తానని చెప్పి నమ్మించాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్, ఫోన్‌పే స్కానర్ తీసుకున్నాడు. ఆమె అకౌంట్‌లో ఉన్న రూ.15 వేలు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. బాధితురాలు శారదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


