అక్రమ స్కానింగ్‌లో నిందితులపై చర్యలేవీ?
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు నగరంలో ఆరు నెలలకు కిత్రం అక్రమ స్కానింగ్ కలకలం రేపింది. గతేడాది మే నెలలో స్కానింగ్ చేస్తున్న వారిని కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వారు, వారికి సహకరిస్తున్న 24 మందిపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఇన్నాళ్లు అధికారులు గోప్యంగా ఉంచారు. మూడు నెలలకు క్రితం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఇద్దరి పాత్ర ఉన్నట్టు తేలడంతో కలెక్టర్ ఆదేశాలతో వారిపై వేటు వేశారు. ఈ కేసులో ఆర్‌ఎంపీలే అధికంగా ఉన్నారనే విషయం బట్టబయలైంది. ఇక మెడికల్ షాప్ నిర్వాహకులు, ప్రైవేటు క్లినిక్‌లో పనిచేసే సిబ్బంది కూడా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చారు. అదేవిధంగా పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది, చిత్తూరు ఆర్టీసీలో పనిచేసే ఒక కండక్టర్ పాత్ర కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వైద్య శాఖలో పనిచేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకున్న జిల్లా అధికారులు మిగిలిన శాఖ ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆ కేసులో ఉన్న 24 మందిని త్వరలో బహిర్గతం చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


