వావిల్ తోట.. ఇసుక వేట
సాక్షి టాస్క్‌ఫోర్స్: వావిల్‌తోట ఇసుక గుట్టగా మారింది. వంకలో ఇసుకాసురుల పంట పండుతోంది. ఇక్క డ డంప్ చేసి తమిళనాడుకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ తెల్లబంగారం దోపిడీలో తోటలోని ముగ్గు రు నేతలు ఆరితేరి కోట్లు కొల్లగొడుతున్నారు. అధికారులను మాముళ్ల మత్తులో ముంచెత్తుతున్నారు. ఈ తోటలో ఇసుక మాఫియా గుట్టుగా సాగిపోతోంది.
పూతలపట్టు మండలంలోని వావిల్‌తోట వంక ఇసుక అక్రమ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు వంకలో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుకుని పోతున్నారు. జేసీబీలు పెట్టి ఇసుకను తవ్వి, వందలాది ట్రాక్టర్లలో ఇసుకను నింపి అక్కడక్కడ డంప్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వావిల్ తోట వద్ద వీర్ల గుడిపల్లి గ్రామ సమీపంలో డంప్ ఏర్పాటు చేసుకుని దానికి కంచె వేసుకున్నారు. పెరుమాళ్లపల్లి ప్రాంతంలో మరో డంప్ దర్శనమిస్తోంది. రాత్రి అయితే చాలు ఇక్కడి నుంచి రోజూ ఆరు ఇసుక లారీలు, టిప్పర్లు తమిళనాడుకు వెళుతున్నాయి. ఈ లారీలు 80 శాతం వరకు కాణిపాకం బైపాస్ మీదుగా చిత్తూరు ఇరువారం బ్రిడ్జి నుంచి యాదమరి మీదుగా తమిళనాడుకు చేరుతున్నాయి. మరి కొన్ని వాహనాలు కలెక్టరేట్ మీదుగా గుడిపాల నుంచి తమిళనాడులోకి చొరబడుతున్నాయి. మరో 20 శాతం వాహనాలు కర్ణాటకకు వెళ్లిపోతున్నాయి. ఈ బండ్లు సరిగ్గా రాత్రి 9.30 గంటలకు డంప్ నుంచి నల్లపట్ట కట్టుకుని బయలుదేరుతున్నాయి. ఇరువారం బ్రిడ్జి వద్ద రాత్రి 10 నుంచి 10.30 గంటల సమయంలో కనిపిస్తున్నాయి.
అధికారులనూ కొనేశారు?
ఇసుక అక్రమ తవ్వకాలపై పలు మార్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు అక్రమ ఇసుక తవ్వకాలు చేసే తమ్ముళ్లకు సమాచారం అందించి, పరిశీలనకు వెళుతున్నారు. అలా వెళ్లిన అధికారులు అక్రమ ఇసుక తవ్వకాలను కప్పిపుచ్చి కట్టు కథలు చెబుతున్నారు. లేకుంటే రెండు రోజులు తవ్వకాలు నిలిపివేసి, మళ్లీ తవ్వకాలను ప్రారంభించేలా డైరెక్షన్ ఇస్తున్నారు. గత నెల అక్రమ ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వదిలేయడం గమనార్హం. అప్పటి నుంచి పూతలపట్టు తహసీల్దార్ కార్యాలయంలోని అధికారికి పెద్ద మొత్తంలో మాముళ్లు ముడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ట్రాక్టర్‌కు రూ. 2వేలు చొప్పున నిఘాశాఖ, మైనింగ్ శాఖకు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులందరూ ఏకమై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వారు స్పందించని పక్షంలో రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


