రేషనలైజేషన్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

రేషనలైజేషన్‌ టెన్షన్‌

Jan 19 2026 4:21 AM | Updated on Jan 19 2026 4:21 AM

రేషనలైజేషన్‌ టెన్షన్‌

రేషనలైజేషన్‌ టెన్షన్‌

● డీఎస్సీకి ఖాళీల సేకరణ ● రేషనలైజేషన్‌, బదిలీలకు కసరత్తు ● 10 లోపు విద్యార్థులుంటే విలీనం ● కసరత్తు మొదలు పెట్టిన విద్యాశాఖ అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో టీచర్ల భర్తీకి త్వరలో డీఎస్సీ నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జిల్లాలో ఖాళీల వివరాలను మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ఉద్యోగోన్నతులు, ఆ తర్వాత టీచర్ల సాధారణ బదిలీలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సమాచారంతో గత డీఎస్సీలో ఉద్యోగాలు సాధించలేకపోయిన నిరుద్యోగులు టీచర్‌ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో పుస్తకాలు తిప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికే జిల్లాలోని నిరుద్యోగులు కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

రేషనలైజేషన్‌ టెన్షన్‌

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లలో రేషనలైజేషన్‌ టెన్షన్‌ మొదలయ్యింది. గతేడాది మే నెలలో జరిగిన బదిలీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అధికంగా ఉండడంతో వాటిని సర్దుబాటు చేయడానికి మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పీఎస్‌హెచ్‌ఎం పేరుతో వందలాది మంది స్కూల్‌ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ఇంకో వైపు ఉన్నత పాఠశాలల్లోనూ ఒకటి నుంచి పదవ తరగతి వరకు నిర్వహిస్తూనే, అక్కడ ప్రాథమిక స్థాయికి పీఎస్‌హెచ్‌ఎంతో పాటు ఎస్‌జీటీలను నియమించారు. ఇప్పుడు మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు తక్కువగా ఉన్నా, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 వరకు విద్యార్థులు లేకున్నా అక్కడ నలుగురు, ఐదుగురు టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరినీ రేషనలైజేషన్‌లో వచ్చే బదిలీల్లో ఖచ్చితంగా బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిసతున్నారు.

జిల్లాలో టీచర్ల భర్తీకి త్వరలో డీఎస్సీ అంటూ లీకులు ఇచ్చిన ప్రభుత్వం మరోవైపు రేషనలైజేషన్‌ పేరుతో బడుల విలీనానికి కసరత్తు ముమ్మరం చేస్తోంది. డీఎస్సీ కోసం మండలాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు సేకరించాలంటూ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో 10 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న బడులను విలీనం చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో ఉపాధ్యాయుల్లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది.

10 కంటే తక్కువ సంఖ్యలోవిద్యార్థులుంటే విలీనం

చంద్రబాబు ప్రభుత్వం విలీనం పేరుతో ప్రభు త్వ పాఠశాలలను మూసివేసేందుకు కుట్రలు పన్నుతోంది. త్వరలో నిర్వహించే ప్రక్రియలో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థుల్లోపు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు 10 లోపు విద్యార్థులుంటే ఆ పాఠశాలను సమీపంలోని పాఠశాలలోకి విలీనం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు విద్యార్థుల్లోపు, 10 మంది విద్యార్థుల్లోపు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో 100 నుంచి 110 వరకు ఉన్నాయనే నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కసరత్తుతో బదిలీల్లో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లపై ఖచ్చితంగా రేషనలైజేషన్‌ ప్రభావం పడనుండడంతో టెన్షన్‌ మొదలైంది.

ఉద్యోగోన్నతులు, బదిలీలకు చర్యలు

జిల్లాలోని టీచర్లకు ఉద్యోగోన్నతులు, బదిలీలను చేపట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి ఏటా మే నెలలో బదిలీలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో తొలుత బదిలీలు నిర్వహించి, ఆ తర్వాత మిగిలిన ఖాళీ పోస్టులను ఉద్యోగోన్నతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. అందుకే ఏప్రిల్‌లోనే బదిలీలు చేపట్టి ఆ తర్వాత ఉద్యోగోన్నతులు ఇవ్వనున్నారు. ఈ రెండు ప్రక్రియలు ముగిసిన వెంటనే డీఎస్సీ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. టీచర్ల బదిలీలు, డీఎస్సీ షెడ్యూల్‌ ఒకేసారి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement