పురవీధుల్లో ఊరేగిన వేణుగోపాలుడు
కార్వేటినగరం: స్థానిక సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి మూలవిరాట్‌ను పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, నారికేళి జలాలతో అభిషేకించారు. అనంతరం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారిని పట్టు వస్త్రం, సుగంధ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 4.45 నుంచి 5.15 గంటల వరకు వేద పండితులు వేద మంత్రాల నడుమ గోపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం 5.15 నుంచి 7.30 గంటల వరకు ఉభయ దేవేరులతో పాటు స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ప్రతిష్టించి మేళతాళాల నడుమ పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఇంటింటా కర్పూర హారుతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 8 గంటలకు వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమేష్‌బాబు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి సురేష్‌కుమార్, అర్చకులు నారాయణదాసరి, గోపాల ఆచారి తదితరులు పాల్గొన్నారు.
పురవీధుల్లో ఊరేగుతున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడు
గోపూజ కార్యక్రమంలో
ఆలయ వేద పండితులు
పురవీధుల్లో ఊరేగిన వేణుగోపాలుడు


