‘బరి’తెగించేశారు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సంక్రాంతి పండక్కి పందెం రాయుళ్ల బరితెగించేశారు. సంప్రదాయ ఆట ముసుగులో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు వెలిశాయి. ఈ తతంగంలో మద్యం అమ్మకాలు సైతం ఎక్కువగా జరి గాయి. దీన్ని నిలువరించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేసినా.. పందెం నిర్వాహకులు మాత్రం ‘తగ్గేదే..లేదు’ అన్న ధోరణితో దూసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. పూతలపట్టు మండలం, బండపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగనాడు కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందేలు కాయడానికి బరిలోకి దిగుతుంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పందేలతో పాటు అవసరమైన ‘నిషా’ అందుబాటులో ఉండడం రివాజుగా మారుతోంది. పైగా అచ్చొచ్చిన ప్రాంతం కావడంతో కచ్చితంగా పందెం గెలిచే అవకాశం ఉంటుందని ఒక బలమైన నమ్మకం. అందుచేతనే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
కిక్కిరిసిన బండపల్లి
బుధ, గురు, శుక్రవారాలలో బండపల్లి గ్రామం పందెం రాయుళ్లు, వీక్షకులతో కిక్కిరిసింది. ఇక్కడి నిర్వాహకులు మొత్తం మూడు బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒక్కో బరి నుంచి రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం కోడి పందేలు మాత్రమే కాకుండా.. సప్త వ్యసనాలలో ఒక్కటైన పేకాట విచ్చల విడిగా జరిగినట్లు అక్కడ భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఓ భాదితుడు పేర్కొనడం గమనార్హం. పేకాటలో తానూ ఎన్నో మోసాలు చూశానని, కానీ ఇటువంటి మోసాన్ని ఎప్పుడూ చూడలేదని దాదాపు రూ.3.5 లక్షలు పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క ప్రవేశ రుసుము వలనే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నిర్వాహకులు రాబట్టారని స్థానిక ప్రజలు అంటున్నారు. పెద్ద పందేలతో పాటు చిన్నచిన్న చిల్లర పందేల వల్ల దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు లావాదేవీలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల అంచనా. ఈ మూడు రోజుల పాటు క్రీడా ప్రాంగణం పరిసరాలలో ఏర్పాటు చేసిన దుఖాణాల నుంచి నిర్వాహకులు బాగానే లాభాలు ఆర్జించారని వారి ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడి నిర్వాహకులకు ఈ ‘సంక్రాంతి బరులు’ వల్ల భారీగా వెనకేసుకున్నారనేది అక్షర సత్యం. దీంతో శనివారం కూడా పందేలు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా...పోలీసులు ఈ చట్ట వ్యతిరేఖ కార్యక్రమానికి అడ్డుకట్ట వేయడానికి తీవ్రంగా ప్రయత్నించినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది.


