దొంగ అరెస్ట్
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు ఉమ్మడి జిల్లా రైల్వే పరిఽధిలో దొంగతనాలు చేస్తున్న కుప్పం మండలానికి చెందిన సురేష్‌ను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్‌ఐలు ధర్మేంద్రరాజు, మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు రైల్వేస్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు రూ.2 లక్షల విలువైన 10 గ్రాముల బంగారు మైనర్ చైన్, ఐ ఫోన్ 16+ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా చిత్తూరు, పాకాల, కుప్పం రైల్వే పరిధిలో ప్లాట్‌ఫామ్స్, రైళ్లలో జరుగుతున్న చోరీల నేపథ్యంలో నిఘా పెట్టామన్నారు. డీఎస్పీ హర్షిత ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. శుక్రవారం చిత్తూరు రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం–1లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సురేష్‌ను అదుపులో తీసుకొని విచారించమన్నారు. చెడువ్యసనాలకు బానిసగా మారి సులభంగా డబ్బులు సంపాధించడానికి దొంగతనాలు చేస్తున్నట్లు అతను అంగీకరించాడన్నారు. చిత్తూరు, కుప్పం, రేణిగుంట, పాకాల పరిధిలో దొంగతనాలు చేశాడన్నారు. ఈ మేరకు రికవరీ చేసిన వస్తువులు చిత్తూరు ఆర్‌పీఎ్‌ఫ్ పరిధిలో ఇటీవల నమోదైన బంగారు చైన్, ఐఫోన్ దొంగతనాల కేసులకు సంబంధించినట్లు గుర్తించామన్నారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు పంపినట్టు వెల్లడించారు. ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ అశోక్, టీఎంఎంరెడ్డి, సిబ్బంది కాళిదాసు, కుమార్, లోకేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


