నల్లరాయి..ఆపేదేలేదోయి!
గత నెల అక్రమ క్వారీకి పూజ నల్లరాయికి భలే గిరాకీ చిత్తూరు, తమిళనాడుకు జోరుగా అమ్మకాలు
కూటమిలో అక్రమ గ్రానైట్‌కు హద్దేలేకుండా పోతోంది. పట్టించుకునేవారు లేక కొండలు సైతం కరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా గుట్టను సైతం తవ్వేసుకుంటున్నారు. విలువైన ఖనిజానికి కన్నం వేస్తున్నారు. నల్లరాయిని కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తుతున్నారు. చిత్తూరు, తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: బంగారుపాళ్యం మండలం, దండువారిపల్లి గ్రామం వద్ద అక్రమ క్వారీ జోరుగా కొనసాగుతోంది. గతేడాది కూటమి నేతలకు దండువారి కొండపై కన్నుపడింది. అక్రమ క్వారీతో కోట్లు సంపాదించొచ్చని అడుగులు వేశారు. లక్షణంగా ఆ కొండను ఆక్రమించి.. కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని నిర్ణయించారు. అధికారాన్ని అడ్డుపెట్టి అడ్డంగా అక్రమ క్వారీలో సవారీ చేస్తున్నారు. ఈ క్వారీకి డిసెంబర్‌లో అధికారికంగా భూమి పూజ చేశారు. కొండపైకి హిటాచీలను దింపారు. బహిరంగంగా కొండలో రోడ్డేశారు. చకచక తవ్వకాలు మొదలు పెట్టారు. అలా తొలి తవ్వకాల్లోనే నల్లబంగారం బయటపడింది. విలువైన ఖనిజంగా గుర్తించి దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు.
భలే గిరాకీ
దండువారిపల్లి గ్రామంలో బయటపడ్డ అక్రమ గ్రానైట్‌కు ఎక్కడా లేని డిమాండ్ ఉంది. ఒక గ్రానైట్ దిమ్మె తమిళనాడులో రూ.లక్షల్లో పలుకుతోంది. రోజుకు ఐదు దిమ్మెల వరకు తరలిస్తున్నారు. యాదమరి మీదుగా బహిరంగంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. అలాగే చిత్తూరు నగరంలోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలకు యథేచ్ఛగా తరలించేస్తున్నారు.
బంగారుపాళ్యం దండువారిపల్లెలో అక్రమ క్వారీ
మామూళ్ల మత్తులో అధికారులు
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. ఈ విషయం స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక వేళ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా అలా ఏమీ జరగడం లేదని తోసిపుచ్చుతున్నారు. లేకుంటే మాకు సంబంధం లేదని.. మైనింగ్ శాఖపై తోసిపుచ్చి తప్పించుకుని తిరుగుతున్నారు. అక్రమార్కులకు ఎదురు తిరిగితే.. బదిలీ వేటు తప్పదని భయపడిపోతున్నారు. ఇక కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
నల్లరాయి..ఆపేదేలేదోయి!
నల్లరాయి..ఆపేదేలేదోయి!


