రైలు కిందపడి ఇద్దరు యాచకుల మృతి
పుత్తూరు: పట్టణ పరిధిలో శుక్రవారం జరిగిన వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు యాచకులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్‌ఐ విజయ్‌నాయక్ కథనం మేరకు.. పుత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఒకరు, నందిమంగళం వద్ద మరొకరు రైలు కింద పడి మృతి చెందారు. ఇద్దరూ యాచకులుగా గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
బంగారుపాళెం/గంగవరం: మండలంలోని వినాయకపురం వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గంగవరం మండలం, బూడిదపల్లెకు చెందిన కోనప్ప భార్య లక్ష్మమ్మ(60) బంగారుపాళెం మండలం, వినాయకపురం గ్రామంలో బంధువుల ఇంటికి సంక్రాంతికని వచ్చింది. స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. లక్ష్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువతి మృతి
బైరెడ్డిపల్లె: పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని బైరెడ్డిపల్లె మరవంక వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. బైరెడ్డిపల్లె కురవీధికి చెందిన జయచంద్ర కుమార్తె హేమప్రియ (16) మర్రిమానుచేను గ్రామ సమీపంలోని పొలం వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై బైరెడ్డిపల్లెలోని తన స్వగృహానికి బయల్దేరింది. అదే సమయంలో కుప్పం వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. బైరెడ్డిపల్లె ఎస్‌ఐ చందనప్రియ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్ జిత్తు ఖర్మఖార్ మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్టు నిర్ధారించారు. ఇదిలావుండగా యువతి తండ్రి జయచంద్రకు రెండు సార్లు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అతనికి ఓ కాలు పూర్తిగా పనిచేయదు. దీంతో హేమప్రియ చదువుకుంటూ కుటుంబానికి ఆసరా ఉండేది. శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందడంతో కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 64,064 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,663 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
ఉత్తమ లేఖ రాస్తే...రూ.50వేలు!
తిరుపతి సిటీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తమ విద్యార్థుల కోసం జాతీయ, అంతర్జాతీయ లేఖ రచన పోటీలను నిర్వహిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టల్ సహకారంతో నిర్వహించనున్న ఈ పోటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని సీబీఎస్‌ఈ తెలిపింది. 9 నుంచి 15 ఏళ్ల వయస్సులోపు విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని డిజిటల్ యుగంలో మాన వ సంబంధాలు ప్రాముఖ్యతను వివరిస్తూ స్నేహితునికి విద్యార్థులు లేఖ రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు రాసిన లేఖలను సంబంధిత పాఠశాలలు మార్చి 20వ తేదీ లోపు సీబీఎస్‌ఈకి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి, ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదు బహుమతితోపాటు ప్రశసంసాపత్రాలను అందజేస్తారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి స్విజర్లాండ్ టూర్ ప్యాకేజిని సీబీఎస్‌ఈ అధికారులు అందించనున్నారు.
రైలు కిందపడి ఇద్దరు యాచకుల మృతి


