కాలుదువ్విన కోడె గిత్తలు
వెదురుకుప్పం: కోడెగిత్తలు కాలు దువ్వాయి. జనసమూహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతూ తమ పౌరుషాన్ని చూపించాయి. ఎడ్ల వేగాన్ని నియంత్రించ లేక యువత ప్రేక్షక పాత్ర వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని వేణుగోపాలపురం గ్రామంలో జరిగిన జల్లికట్టు జోష్ నింపింది. నిర్వాహకులు ముందుగా ఎడ్లకు పలకలు, వస్త్రాలతో పాటు బెలూన్లు కట్టి పందేనికి సిద్ధం చేశారు. అంతకుముందే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికి చేరుకున్నారు. పలకల కోసం అల్లి వద్ద సిద్ధంగా యువత నిలబడడంతో నిర్వాహకులు ఎడ్లను ఉసిగొల్పారు. పరుగులు తీస్తున్న ఎడ్లను యువత కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఎడ్ల వేగాన్ని నిలువరించలేక చేతులెత్తేశారు. పలకల కోసం యువత పోటీలు పడ్డారు. పశువుల కింద పడి కొందరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో గ్రామం జనంతో కిక్కరిసింది. గ్రామంలో కనుమ సందడి నెలకొంది.
ఈచనేరిలో దుమ్మురేపిన కోడెగిత్తలు
తవణంపల్లె: మండలంలోని ఈచనేరిలో శుక్రవారం కోడెగిత్తలు దుమ్మురేపాయి. కనుమ పండుగ సందర్భంగా ముందుగా దేవర ఎద్దులకు పూజలు చేసి ఊరేగించారు. అనంతరం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 80 ఎద్దులకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి పరుగు పందేనికి ఉసిగొల్పారు. రంకెలేస్తూ..పౌరషంతో దూసుకొస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఎద్దుల పరుగు పందేలను తిలకించడానికి పలు మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎద్దులు పరుగులు తీస్తుండగా జనంపై దూకడంతో ఒకరిపై ఒకరు పడి గాయపడ్డారు. అల్లి వద్ద ఎద్దు తిరగబడి పోలీస్ అధికారి(ఏఎస్‌ఐ)ని గాయపరచింది. ఎద్దులకు సుమారు 15 బహుమతులు అందజేయగా.. మొదటి బహుమతి ఐరాల మండలానికి చెందిన ఎద్దు రూ.50 వేలు, బంగారుపాళ్యంకు చెందిన ఎద్దు ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు కై వసం చేసుకున్నాయి. తవణంపల్లె ఎస్‌ఐ డాక్టర్ నాయక్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తవణంపల్లె: ఈచనేరిలో పరుగులు తీస్తున్న కోడెగిత్త
తవణంపల్లె: దిగువమోదలపల్లెలో దేవర ఎద్దులకు ప్రత్యేక అలంకరణ
వెదురుకుప్పం: దూసుకొస్తున్న కోడె గిత్తలు
తవణంపల్లె: ఎద్దులను నిలువరిస్తున్న యువకులు
తవణంపల్లె : దూసుకొస్తున్న కోడెగిత్తలు
కాలుదువ్విన కోడె గిత్తలు
కాలుదువ్విన కోడె గిత్తలు
కాలుదువ్విన కోడె గిత్తలు
కాలుదువ్విన కోడె గిత్తలు


