భోగి మంటల్లో పీపీపీ జీఓ కాపీల దహనం
చిత్తూరు కార్పొరేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీఓ కాపీల జిరాక్స్‌లను భోగిమంటల్లో వేసి వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన తెలిపారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. బోగి మంటల చుట్టూ గొబ్బెమ్మలతో మహిళ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో దోచుకో.. బినామీలకు పంచుకో.. జనాన్ని పిండుకో బాబు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రూ.1,750 కోట్లు వెచ్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అదే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.1,500 కోట్లు లేవా..? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగనన్నకు మంచి పేరు వస్తుందని భావించి కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకోవడం బాధాకరమన్నారు. పేద బిడ్డలను వైద్య విద్యకు దూరంగా చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. అందని ద్రాక్షగా ఉన్న వైద్యవిద్యను అందరికీ అందించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 70 శాతం వరకు వైద్య కళాశాలలను నిర్మించిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వాటిని ప్రైవేటుపరం చేసి తమ వక్రబుద్ధిని చూపించిందన్నారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేశారని గుర్తుచేశారు. సర్పంచ్‌లు రజనీకాంత్, మధుసూదన్‌రాయల్ మాట్లాడుతూ ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించాల్సిన ప్రభుత్వం వాటిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూస్తోందన్నారు. రాబోయే రోజుల్లో విద్య సైతం పూర్తి స్థాయిలో ప్రైవేటుపరం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. బినామీలకు కట్టబెట్టడానికే పీపీపీ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు సూర్యప్రతాప్‌రెడ్డి, హరీషారెడ్డి, అంజలిరెడ్డి, గిరిధర్‌రెడ్డి, మధురెడ్డి, అమర్‌నాథరెడ్డి, మనోజ్‌రెడ్డి, కౌసర్, బిందు, శాంతి, ప్రతిమారెడ్డి, వెంకటేష్, నౌషద్, నవాజ్, నూతన్‌ప్రసాద్, సెల్వ, సోము, నాగేంద్ర పాల్గొన్నారు.
భోగి మంటల్లో పీపీపీ జీఓ కాపీల దహనం


