వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రతులతోనే భోగి మంటలు
నగరి : ప్రజలకు భోగి భాగ్యాలను నింపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. బుధవారం నగరిలోని తన నివాసంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాలు జరుపుకున్నారు. భోగి మంటల చుట్టూ కుటుంబ సభ్యులతో కలిసి భోగి పాటలతో నృత్యాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో పంచుకుంటే మరింత ఆనందంగా ఉంటుందని, ఆయుష్షు కూడా పెరుగుతుందన్నారు. బంధువుల మధ్య బంధుత్వాలు పెంచే పండగే సంక్రాంతి అన్నారు. పల్లె వాతావరణంలో పండుగలు జరుపుకోవడం భావితరాలకు మనం సంస్కృతిని చాటిచెప్పడమే అన్నారు. గత పాలనలో సంక్రాంతి కాంతులు ప్రజల్లో కనిపించేదన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండగని, అయితే ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పంటలకు బీమాతోపాటు గిట్టుబాటు ధర లేదన్నారు. విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. పేదలకు వైద్యవిద్యను దూరం చేస్తూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రతులను కాలుస్తూ ప్రజలు భోగిమంటలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త ఆర్కేసెల్వమణి, కుమారుడు కృష్ణకౌసిక్, సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


