ప్రతి కుటుంబంలో సంక్రాంతులు నిండాలి
చిత్తూరు కలెక్టరేట్ : సంక్రాంతి పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలో సంతోషం నింపే పండుగ సంక్రాంతి అని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
19 నుంచి డీఈడీ తృతీయ
సెమిస్టర్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి డీఈడీ తృతీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
జనగణనకు సన్నాహక చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి జిల్లాలో జనగణన 2027లో చేపట్టేందుకు అధికారులు సన్నాహక చర్యలు ప్రారంభించారు. జిల్లాలో జనగణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. జనాభాను క్రమపద్ధతిలో లెక్కించి, ప్రతి పౌరిడి సమగ్ర సమాచారాన్ని సేకరించి నమోదు చేసేందుకు జనగణనకు పరిధుల నిర్ణయం, అధికారులకు విధుల కేటాయింపు ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో చార్జి సెన్సస్ అధికారులుగా మున్సిపల్ కమిషనర్‌లను, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లను నియమించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 21న ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్, 23న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
19 నుంచి
దక్షిణ భారత సైన్స్ ఫెయిర్
చిత్తూరు కలెక్టరేట్ : దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సైన్స్ ఫెయిర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని రామకుప్పం జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న జుల్ఫా అనే విద్యార్థిని, రోజారాణి గైడ్ టీచర్ రూపొందించిన సైన్స్ ప్రాజెక్టుతో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ లో పాల్గొననున్నారు.
ఆన్‌లైన్ కోర్సులు పూర్తిచేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు ఆన్‌లైన్ కోర్సులను కచ్చితంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు నిషిత ఎఫ్‌ఎల్‌ఎన్, నిషిత ఈసీసీఈ (నిషిత 4.0) ఆన్‌లైన్ కోర్సులను తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. సంవత్సరానికి 50 గంటల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ఆన్‌లైన్ కోర్సుల పూర్తికి టార్గెట్ విధించారు. కోర్సును గత ఏడాది డిసెంబర్ 3న ప్రారంభించారు. కోర్సు ఈ ఏడాది మార్చి 10వ తేదీన ముగుస్తుందన్నారు. కోర్సుల్లో నమోదు, పూర్తి చేసుకోవడం పై అమలు చేయాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు.
ఫేషియల్ అటెండెన్స్‌తోనే వేతనాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ స్టడీ లీవ్‌లో బీఈడీ, బీపీఈడీ కోర్సులు చేస్తున్న టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ కచ్చితత్వం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇకపై స్టడీ లీవ్‌లో ఉంటూ కోర్సులు చేస్తున్న టీచర్లు కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేస్తేనే వేతనాలు మంజూరు చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


