వదల బొమ్మాళి!
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలో వరుసగా టీడీపీ నేతల ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తూ భారీ చోరీలకు పాల్పడుతున్నారు. వీరంతా కోస్తా ప్రాంతానికి చెందిన వారే. రెక్కీ నిర్వహించడం, ఆపై ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బు, బంగారంతోపాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. వీరు టీడీపీ నేతల ఇళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ విషయం పోలీసులకు సైతం అంతుపట్టడం లేదని సమాచారం.
ఇప్పటిదాకా చోరీలు ఇలా..
బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత జిల్లా నాయకురాలైన మండలంలోని కొలమాసనపల్లికి చెందిన ముంజులారెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. దీన్ని ఏదో సాధారణ దొంగల చోరీనేనని అందరూ అనుకున్నారు. ఆపై గతేడాది జూలై 15న పలమనేరు పట్టణంలోని టీడీపీ సీనియర్ నేత ఆర్వీ బాలాజీ ఇంట్లో 210 గ్రాముల బంగారం చోరీ జరిగింది. అప్పట్లో ఇదో సంచలనంగా మారింది. ఇలా ఉండగా రూరల్ మండలం, సాకేవూరు గ్రామానికి చెందిన రామూర్తి నాయుడు పట్టణంలోని రాధాబంగ్లాలో నివాసముండే ఇంట్లో గత ఆగస్టు 30న చోరీ జరిగింది. ఇందులో 540 గ్రాముల బంగారు, 336 గ్రాముల వెండితో కలిపి రూ.40 లక్షల భారీ చోరీ జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు రామూర్తి నాయుడి కేసులో తూర్పు గోదావరికి చెందిన అడపాల శివను గతంలో అరెస్ట్ చేశారు. ఇక బాలాజీ కేసులో గుంటూరు జిల్లా, పల్నాడుకు చెందిన రాయపాటి వెంకయ్యను ఇటీవలే అరెస్ట్ చేశారు.
ఏఎంసీ చైర్మన్ ఇంట్లో..
ఇటీవల పెను రాజకీయాల మధ్య పలమనేరు ఏఎంసీ చైర్మన్‌గా రాజన్న ఎంపికయ్యారు. గంగవరం మండలం, ఆలకుప్పంలోని ఆయన నివాసంలో రెండ్రోజుల క్రితం దొంగలు పట్టపగలే సీసీ కెమెరాలను ధ్వంసం చేరి చోరీ చేశారు. ఇంట్లో రూ.12లక్షల విలుజేసే బంగారు, వెండిని దోచుకెళ్లారు.
ఇవన్నీ కోస్తా దొంగల పనేనా?
ఈ చోరీల్లో ఇప్పటి దాకా పోలీసులు పట్టుకున్న దొంగలు కోస్తా జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. తాజాగా రాజన్న ఇంట్లో చోరీ చేసిన దొంగలు సైతం గుంటూరు జిల్లాకు చెందిన ఆరితేరిన దొంగల ద్వారానే ఇక్కడ రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. దీంతోనే కావాలని అక్కడి దొంగలు పలమనేరు నియోజకవర్గంలోని టీడీపీ బడా నేతల ఇళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఎప్పుడు ఏం జరుగుతుందో..!
మరోవైపు పట్టణంలోని ముగ్గురు టీడీపీ నేతలు, బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ఇరువురు, వీకోటకు చెందిన ఇరువురు ఇళ్లల్లోనూ చోరీలు జరిగే అవకాశం ఉందనే చర్చ ఆ పార్టీ నేతల్లో నిద్ర లేకుండా చేస్తోంది. ఇలా ఉండగా కేవలం కోస్తా జిల్లాలకు చెందిన దొంగలు ఎందుకు ఈ ప్రాంతంలోని టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనే విషయంపై పోలీసులకు సైతం అంతుపట్టడం లేదు.


