
ప్రహసనంగా ఎఫ్‌ఏ–1 పరీక్షల విధానం
చిత్తూరు కలెక్టరేట్ : అన్ని విద్యాసంస్థల్లో జరుగుతున్న ఎఫ్‌ఏ–1 పరీక్షల విధానంలో పలు మార్పులు ముఖ్యమని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సోమవారం నుంచి జరగనున్న ఎఫ్‌ఏ–1 పరీక్షలు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు ఓ పరీక్షగా మారిందని విమర్శించారు. ఇంతవరకు నూతన పరీక్ష విధానం పట్ల ఏ అధికారి నేటి వరకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేదని తెలిపారు. మండల కేంద్రం నుంచి ఉపాధ్యాయులు అసెస్‌మెంట్ పుస్తకాలు తెచ్చుకోవడం ఓ పరీక్ష అయితే, ప్రతిరోజూ పరీక్ష పత్రాలు తెచ్చుకోవడం మరో పరీక్ష అని దుయ్యబట్టారు. ప్రపంచ బ్యాంకు నిధుల కోసం కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను భయాందోళనలకు ఇలా గురిచేస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఉపయోగపడని విద్యా విధానాలను, పరీక్షా విధానాలను తక్షణమే ఉపసంహరించుకుని.. విద్యార్థులకు స్వేచ్ఛ ఉండేలా మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమే
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమేనని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శులు వాడ గంగరాజు, బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసేందుకే ఈ క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున బహుమతులు ఇస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని పలు స్కూళ్ల వద్ద గుట్కా, మత్తుపదార్థాలు విక్రయాలు జరుగుతున్నాయని, పోలీసులు నిఘా పెట్టి నియంత్రించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ మసూద్, నాయకులు దిలీప్, నిసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగో రోజూ ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పంటలను సర్వనాశనం చేశాయి. ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు మిట్టమీదరాచపల్లె పంచాయతీలో పంటలను తొక్కిపడేశాయి. పురుషోత్తం రెడ్డికి చెందిన కొబ్బరి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. అలాగే మామిడి కొమ్మలను విరిచేశాయి.
ఏనుగుల దాడిలో టమాట పంట ధ్వంసం
ఐరాల: మండలంలో రెండు ఏనుగులు మళ్లీ విజృంభించాయి. శనివారం అర్ధరాత్రి నయనంపల్లెకు చెందిన రైతులు చిన్నయ్య, రాఘవయ్యకు చెందిన టమాట పంటలను ధ్వంసం చేశాయి. అపోలో వారికి చెందిన నాలుగు రాతికూసాలను కూలదోశాయి. అటవీ అధికారులు ఇకనైనా ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కరుణించమ్మ.. గంగమ్మ..
చౌడేపల్లె: జిల్లాలో రెండో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కరుణించమ్మ.. గంగమ్మా అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యే కంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రావణమాసం సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలతో గంగమ్మకు పూజలు చేశారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు.
జాతీయ స్థాయి తెలుగుభాషా పోటీలు
పలమనేరు: వచ్చే తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి తెలుగుభాషా పోటీలను నిర్వహించనున్నట్లు తెలుగుసాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు అమృతభాష అనే అంశంపై రెండు పేజీలకు మించకుండా వ్యాసం రాసి ఈనెల 20వ తేదీలోపు కళామందిరం, గంగవరం, 517408 అనే చిరునామాకు తపాలా ద్వారా మాత్రమే పంపాలని సూచించారు.

ప్రహసనంగా ఎఫ్‌ఏ–1 పరీక్షల విధానం

ప్రహసనంగా ఎఫ్‌ఏ–1 పరీక్షల విధానం

ప్రహసనంగా ఎఫ్‌ఏ–1 పరీక్షల విధానం