రసాయనాలను యథేచ్ఛగా రోడ్డుపైనే వదిలేస్తున్న డైయింగ్ యూనిట్ల యజమానులు
పట్టించుకోని అధికారులు
నగరి : మీరేమైనా చేసుకోండి..! అధికారులుగా మీ పని మీది.. మా పని మాది.. మేమింతే మారం అంతే..! అంటున్నారు కొందరు డైయింగ్ యూనిట్లు నడుపుతున్న యజమానులు. రసాయనాలను యథేచ్ఛగా రోడ్డుపైనే వదిలేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
ఏళ్ల తరబడి ఇవే సమస్యలు
గురువారం కొత్తపేట భజన గుడి వీధిలోని రోడ్డుపైనే రసాయన నీరు ప్రవహించింది. నిబంధనలు పాటించని డైయింగ్ యూనిట్ల నియంతృత్వ పోకడకు నిదర్శనంగా నిలిచింది. వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేని అధికారుల అసమర్థతకు అద్దంపట్టింది. ఏళ్ల తరబడి బరిస్తూ వస్తున్నాం ఇంకా ఎన్నాళ్లు భరించాలంటూ స్థానికులు ప్రశ్నించడం కనిపించింది. డైయింగ్ యూనిట్లను ఊరికి దూరంగా పంపేస్తాం.. అందుకు అనువైన భూమిని సేకరిస్తున్నాం.. అంటూ ఉన్నతాధికారులు చెప్పే మాటలు కాగితాలకే పరిమితమవడం విమర్శలకు తావిస్తోంది.
రంగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
‘నగరిలో రంగునీటి సమస్యకు మోక్షం ఎప్పుడు?.. స్వచ్ఛనగరి కావాలన్న ప్రజల ఆకాంక్ష తీరేదెప్పుడు?’.. అని సీపీఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ పార్టీ కార్యదర్శి వేలన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివీధిలో పారతున్న రసాయనాలను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ అధికారులు ఎవ్వరూ దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు.
సయానికి తగినట్లు నామమాత్రపు పరిష్కారం చూపుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, డైయింగ్ యూనిట్లపై ఆధారపడి జీవిస్తున్న కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని జనావాసానికి దూరంగా తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. వారి వెంట పార్టీ నాయకులు బాషా, విజయకుమార్ ఉన్నారు.

మేమింతే!