
అబార్షన్ కేసులకు కారణాలు తెలపండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అబార్షన్ కేసులకు గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ అబార్షన్ కేసులన్నింటినీ పరిశీలించాలన్నారు. అందుకు గల కారణాలను నివేదికల రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువ శాతం కాన్పులు జరగాలన్నారు. శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరగకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో నెలకు 50 సుఖ ప్రసవాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పీసీ పీఎన్‌డీటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమీక్షలో డీఎంఅండ్‌హెచ్‌వో సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు.
వాటిని ఎందుకు తనిఖీ చేయడం లేదు?
జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు ఎందుకు తనిఖీ చేయడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ కాలనీల్లో అన్ని మౌలిక వసతులు మెరుపరచాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి జిల్లాలో 2.05 లక్షల మంది అర్హులున్నట్టు తేలిందన్నారు. వీరి ఖాతాల్లో రూ.138 కోట్లను ప్రభుత్వం జమచేయనున్నట్లు వెల్లడించారు. డ్వామా శాఖ సమీక్షలో మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న గోకులం షెడ్ల బిల్లుల మంజూరులో జాప్యం చేయకూడదని ఆదేశించారు. జిల్లాలో 2,795 మినీ గోకులం షెడ్లు నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. ఒక్కొక్క షెడ్ నిర్మాణానికి రూ.2.30 లక్షలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇందుకు జిల్లాలో చేపట్టే పనులకు రూ.62.93 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో డ్వామా శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.