
బకాయిలు చెల్లించాలి
● ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి ● ఆగస్టు 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా ● పిలుపునిచ్చిన ఫ్యాప్టో నాయకులు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మణిగండన్, సెక్రటరీ జనరల్ మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం జిల్లా ఎన్‌జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లకు బోధనేతర పనుల నుంచి మినహాయించాలన్నారు. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. బోధనను హరించే యాప్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి టీచర్లు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలోని సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పీ–4 కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులను నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్ మాట్లాడుతూ నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని డిమాండ్ చేశారు. 72, 73, 74 జీవోలను వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీచర్లను బోధనకు తప్ప ఏ ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదన్నారు. హైస్కూల్ ప్లస్‌లలో వెంటనే టీచర్ల నియామకాలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పూల్‌తో వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ విధానంలోనే భర్తీ చేయాలన్నారు. ఏపీటీఎఫ్, సీపీఎస్ అసోషియేషన్ నాయకులు సమీర్ మాట్లాడుతూ 12 వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్ల పై ఆ సంఘ నాయకులు చర్చించి నిరసన చేపట్టారు. ఫ్యాప్టో సంఘ నాయకులు అరుణ్‌కుమార్, ముక్తార్ అహ్మద్, రామచంద్రయ్య, శేఖర్, రంగనాథం, గణపతి పాల్గొన్నారు.