● వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ● 2,05,753 మంది రైతులు ఎంపిక ● నేడు రైతు ఖాతాల్లోకి నిధులు జమ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అన్నదాత ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. వివిధ కారణాలతో అన్నదాత సుఖీభవ పథకానికి చాలా మందిని దూరం చేసింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ టీడీపీ అధినేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే హామీని తుంగలో తొక్కేశారు. తాజాగా పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14వేలు మూడు విడతల్లో అందజేస్తామని ఆయన ఇటీవల సెలవివ్వడం గమనార్హం.
2,05,753 మంది అర్హులు
జిల్లాలో మూడు లక్షల హెక్టార్ల మేర వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 2.5 హెక్టార్ల దాకా వివిధ రకాల పంటలు సాగుచేస్తుంటారు. దీనిపై మూడు లక్షల మంది దాకా రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో 70 శాతం మంది పేద రైతులే. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యాప్తంగా 2,05,753 మందిని గుర్తించారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.102.88 కోట్లు, పీఎం కిసాన్‌లో 1.76 లక్ష మందికి గాను రూ.35.2 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధులు శనివారం నుంచి అన్నదాత ఖాతాల్లో జమకానున్నాయి.
మోసపూరితమైన మాటలు
2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు జబ్బలు చరిచారు. అధికారంలోకి వచ్చాక రైతులందరికీ పంగనామాలు పెట్టారు. రుణం మొత్తాన్ని ఐదు విడతల్లో ఇస్తామని ఒకటి, రెండు విడతలు ఇచ్చి మిగతావి ఎగనామం పెట్టారు.
25,391 వేల మంది దూరం
ఈకేవైసీ, ఆధార్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదని..ఇతరత్రా కారణాలతో జిల్లా వ్యాప్తంగా 25,391 వేల మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 2,05,753 మందేనని జిల్లా వ్యవసాయ అధికారులు లెక్కలు గట్టారు. పలువురు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంది. ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వీటిపై అవగాహన లేక వేలాది మంది రైతులు వేలిముద్ర వేయలేదు. వారికి అవగాహన కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా ఇలా..
సంవత్సరం రైతుల సంఖ్య రూ.కోట్లల్లో
2019–20 220256 165.19
2020–21 231038 173.52
2021–22 216594 162.45
2022–23 223165 211.12
2023–24 231144 174.03
అందరికీ అందాలి
అర్హత కలిగిన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలి. ఈ కేవైసీ చేయలేదని, ఇతర సాంకేతిక కారణాలు చూపుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పథకం అందకుండా అన్యాయం చేయాలని చూస్తోంది. అలా కాకుండా అర్హులైన ప్రతి రైతుకూ పథకాన్ని వర్తింప చేయాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం అందక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు లేకుండా అందించాలి. – పాలాక్షిరెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు, బంగారుపాళ్యం
అన్నదాత సుఖీభవకు 25,391 వేల మంది దూరం