– డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం: ‘ఉన్నత చదువులు అభ్యసించి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న నా కుమార్తె కృపాలక్ష్మిని నాపై చూపించిన ఆదరణను నా బిడ్డపై చూపించి ఆమె విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని’ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం కార్వేటినగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత మూడేళ్లుగా తన కుమార్తె కృపాలక్ష్మిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించాలన్న తన అభ్యర్థప మేరకు టికెట్ ఇచ్చిన సీఎం వైఎస్ జగనన్నకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తన గెలుపునకు ఎలా కృషి చేశారో, అదేవిధంగా తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి జగనన్నకు కానుకగా అందజేయాలని పిలుపునిచ్చారు. తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి ఈ సందర్భంగా మంత్రి నారాయణస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి వెంట ఎంపీపీ లత, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, సర్పంచ్ ధనుంజయవర్మ, ఉప సర్పంచ్ శేషాద్రి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి, ధనశేఖర్‌వర్మ, పలువురు ఉన్నారు.
నేడే జగనన్న విద్యాదీవెన●
● జిల్లాలో 32,427 మంది
విద్యార్థులకు లబ్ధి
● 29,407 మంది తల్లుల ఖాతాల్లో
రూ.20,54,29,471 నిధులు జమ చేయనున్న సర్కారు
● కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కార్యక్రమం
చిత్తూరు కలెక్టరేట్ : పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం ఈ నెల 1న ప్రారంభించనున్నారని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రు మండలం నుంచి ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విద్యాసంవత్సరం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లోని 32,427 మంది విద్యార్థులకు గాను 29,407 మంది తల్లుల ఖాతాల్లో రూ.20,54,29,471 నిధులను రాష్ట్రప్రభుత్వం డీబీటీ విధానంలో జమ చేయనుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో పలువురు ఎస్‌ఐల బదిలీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు ప్రాంతాలల్లో పనిచేస్తున్న ఎస్‌ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ జాషువా ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..కాణిపాకంలో ఉన్న పి.శ్రీనివాసరావును గుడిపాలకు, అక్కడ ఉన్న కె.రామ్మోహన్‌ను కాణిపాకానికి, చిత్తూరు వన్‌టౌన్‌లో ఉన్న బి.భారతిని స్పెషల్‌బ్రాంచ్‌కు, చిత్తూరు సీసీఎస్‌లో ఉన్న టి.ప్రసాద్‌ను టూటౌన్‌కు, గంగాధరనెల్లూరులో ఉన్న బి.రామాంజనేయులును యాదమరికి, గంగవరంలో ఉన్న యు.ప్రతాప్‌రెడ్డిను చౌడేపల్లెకు బదిలీ చేశారు. అలాగే చిత్తూరు సీసీఎస్‌లో ఉన్న ఇ.బాబును వి.కోటకు, చిత్తూరు ట్రాఫిక్‌లో ఉన్న ఇ.జయప్పను చిత్తూరు డీసీఆర్‌బీకి, ఐరాలలో ఉన్న యు.వెంకటేశ్వర్లను వెదురుకుప్పానికి, ఇక్కడ ఉన్న బి.రమేష్‌బాబును ఐరాలకు, వీఆర్‌లో ఉన్న కె.స్వర్ణతేజను చిత్తూరు డీసీఆర్‌బీకి, బి.సుబ్బారెడ్డిని చిత్తూరు డీటీసీకి, ఎం.రాజకుళ్లాయప్పను ఎస్‌ఆర్ పురానికి, కె.శాంతమ్మ చిత్తూరు దిశ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అలాగే ఎస్.లోకేష్‌ను పెనుమూరుకు, వై.సుమన్‌ను నగరికి, సి.వెంకటేశ్వర్లును చిత్తూరు డీటీసీకు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఎంకె.ప్రవీణ్‌కుమార్‌ను కుప్పంకు, జి.నాగేంద్రకుమార్‌ను చిత్తూరు వన్‌టౌన్‌కు, ఎ.వెంకటకృష్ణను కార్వేటినగరానికి, డి.శేషగిరిని చిత్తూరు తాలూకాకు, ఎ.వెంకట నారాయణను నిండ్రకు, ఎస్.వెంకటరాముడును విజయపురానికి, జి.రామచంద్రయ్యను నగరి అర్బన్‌కు, జి.ఇక్బాల్‌ను చిత్తూరు టూటౌన్‌కు బదిలీ చేశారు.