విదేశాల్లో దుకాణం బంద్‌! ఆస్తులు అమ్మేస్తున్న జొమాటో..  | Sakshi
Sakshi News home page

Zomato: విదేశాల్లో దుకాణం బంద్‌! ఆస్తులు అమ్మేస్తున్న జొమాటో.. 

Published Sun, Jan 7 2024 6:03 PM

Zomato Exits Most Foreign Markets Shuts Down 10 Subsidiaries Within A Year - Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో విదేశాల్లో తమ ఉనికిని క్రమంగా తగ్గించుకుంటోంది. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆస్తులు అమ్మేస్తోంది. జొమాటో వియత్నాం కంపెనీ లిమిటెడ్,  పోలాండ్‌కు చెందిన గ్యాస్ట్రోనౌసీ వంటి అనుబంధ సంస్థలను లిక్విడేట్ చేస్తున్నట్లు జొమాటో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

వియత్నాం, పోలాండ్‌లోని తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థల కోసం ఖర్చు తగ్గించే చర్యగా రద్దు ప్రక్రియను ప్రారంభించినట్లు జొమాటో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్‌లో తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 2023 మార్చి నుంచి పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది. 

2023 సంవత్సరంలో జొమాటో చిలీ ఎస్‌పీఏ, పీటీ జొమాటో మీడియా ఇండోనేషియా (PTZMI), జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌, జొమాటో ఆస్ట్రేలియా, జొమాటో మీడియా పోర్చుగల్ యూనిపెస్సోల్‌ ఎల్‌డీఏ, జొమాటో ఐర్లాండ్‌ లిమిటెడ్‌ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్‌టైమ్, జొమాటో స్లొవేకియా వంటి వివిధ సంస్థలకు జొమాటో వీడ్కోలు పలికింది. అలాగే కెనడా, యూఎస్‌, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్, సింగపూర్‌లలోనూ జొమాటో తన అకార్యకలాపాలను నిలిపివేసింది. ఇలా అనేక దేశాల నుంచి వైదొలిగినప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో మాత్రం యాక్టివ్‌గానే ఉంది.

16 ప్రత్యక్ష అనుబంధ సంస్థలు, 12 స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలు, జొమాటో పేమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్లింకిట్‌ కామర్స్‌, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఒక అనుబంధ కంపెనీలను జొమాటో తన 2023 వార్షిక నివేదికలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement