లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి

women entrepreneurs corporate leaders to take up leadership roles in large: Nirmala Sitharaman - Sakshi

ముంబై: మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ లీడర్లు మరింత పెద్ద సంఖ్యలో సారథ్య బాధ్యతలను చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ప్రస్తుతం కార్పొరేట్‌ ప్రపంచంలో మహిళా లీడర్ల సంఖ్య తగినంత స్థాయిలో లేదని ఆమె పేర్కొన్నారు. నాయకత్వం వహించడానికి తాము అర్హులమేనని మాటిమాటికి నిరూపించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం మహిళల్లో అంతర్గతంగా పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. దీన్ని అధిగమించి, మరింత మంది స్త్రీలకు అవకాశాలు కల్పించేందుకు మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ లీడర్లు మార్గదర్శకులుగా వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన మహిళా డైరెక్టర్ల సదస్సులో మంత్రి ప్రసంగించారు.  

సంఖ్య చాలా తక్కువ.. 
గణాంకాల ప్రకారం దేశీ కంపెనీల బోర్డుల్లో సగటు మహిళల సంఖ్య 1.03కాగా .. వీరిలో 58 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లేనని సీతారామన్‌ పేర్కొన్నారు. మిగిలిన 42 శాతం స్వతంత్రేతర డైరక్టర్లుగా తెలియజేశారు. కార్పొరేట్లు తమ బోర్డుల్లో మరింతమంది మహిళలకు అవకాశాలివ్వవలసి ఉన్నట్లు సూచించారు. అంతర్జాతీయంగా బోర్డుల్లో స్త్రీల నాయకత్వం కలిగిన కంపెనీలు అత్యధిక లాభాలు, వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఇప్పటికీ పలు కంపెనీలు ఒక్క మహిళా డైరక్టరునూ నియమించుకోకపోవడంతో జరిమానాలు కడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబోదని, కార్పొరేట్‌ ప్రపంచమే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. అయితే మహిళా కార్పొరేట్‌ లీడర్ల కొరత కారణంగా కొంతమందే పలు కంపెనీలలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

బ్యాంకుల మధ్య అనుసంధానత అవసరం 
బ్యాంకులు తమ వ్యవస్థల మధ్య సంప్రదింపులకు వీలుగా అనుసంధామై ఉండాలని, అప్పుడే కస్టమర్లకు మెరుగైన మార్గాల్లో సేవలు అందించడం సాధ్య పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) 75వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. చాలా సందర్భాల్లో కస్టమర్లు ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల వద్ద లావాదేవీలు నిర్వహించాల్సి వస్తోందంటూ.. ఇందుకోసం బ్యాంకులు తమ మధ్య సంప్రదింపులకు వీలు కల్పించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బ్యాంకు ఉద్యోగులు స్థానిక బాషలో కస్టమర్లతో సంప్రదింపులు చేసేలా చూడాలని మంత్రి కోరారు. అప్పుడే కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించడం సాధ్యపడు తుందనీ, మోసాలను నివారించేందుకు బ్యాంకులు పెట్టుబడులు పెంచాలన్నారు.

ఎంఎస్‌ఎంఈల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించండి 
ప్రయివేట్‌ రంగ కంపెనీలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్‌ఎంఈ)ల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించ వలసిందిగా  ఆర్థికమంత్రి మరో కార్యక్రమంలో ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కంపెనీలు సైతం ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపులను సకాలంలో చేపట్టడంలేదంటూ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చిన్న సంస్థలకు సకాలంలో బకాయిల చెల్లింపులపై హామీ లభించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్‌వోసీకి ఖాతాలు దాఖలు చేశాక 45 రోజుల్లోగా ఎంఎస్‌ఎంఈ చెల్లింపులను పూర్తి చేయవలసిందిగా ప్రయివేట్‌ కంపెనీలకు సూచించారు. ఈ బాటలో ప్రభుత్వ శాఖలు, కంపెనీలు 90 రోజుల్లోగా చెల్లింపులు చేపట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోనున్నట్లు లఘు ఉద్యోగ్‌ భారతీ నిర్వహించిన సదస్సు సందర్భంగా వెల్లడించారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తగిన విధంగా స్పందించవలసి ఉన్నట్లు చెప్పారు.   

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top