బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్‌కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.

రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!
1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.
ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్‌కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.

సాహసోపేతమైన నిర్ణయం!
దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.
మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్‌లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్‌బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.

రహస్యంగా తరలింపు!
1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్‌బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.
సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!
ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.
బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్‌నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.

మోదీ పిలుపు
1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా


