నెట్‌ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్‌ | WhatsApp Reportedly Started Testing Offline File Sharing Features With Beta Testers | Sakshi
Sakshi News home page

WhatsApp: వాట్సప్‌ కొత్త ఫీచర్‌.. నెట్‌ లేకుండానే ఫైల్ షేరింగ్!

Apr 26 2024 1:45 PM | Updated on Apr 26 2024 7:01 PM

WhatsApp Reportedly Started Testing Offline File Sharing Features With Beta Testers - Sakshi

మెటా ఆధ్వర్యంలోని వాట్సప్‌ తన వినియోగదారులకు నెట్‌ అవసరం లేకుండానే ఫైల్‌ షేరింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్‌ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్, ఇన్-యాప్ డయలర్‌తో సహా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్‌ ఫైల్‌ షేరింగ్‌కు సంబంధించి ఇప్పటికే బీటా వెర్షన్‌లో పరీక్షలు నిర్వహిస్తోంది.

యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ప్రస్తుతం వాట్సప్‌లో ఫైల్‌ షేర్‌ చేయడం కుదరదు. కానీ కొత్తగా తీసుకురాబోతున్న ఫీచర్‌తో ఇది సాధ్యం అవుతుంది. సమీపంలోని వాట్సప్‌ యూజర్లతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు. 

ఫైల్ షేరింగ్ సేవలకు అవసరమైన డిస్కవరీ సెర్చ్‌ని ప్రారంభించడానికి వినియోగదారులు వాట్సప్‌లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ గూగుల్‌కు చెందిన క్విక్ షేర్, యాపిల్‌లోని ఎయిర్‌డ్రాప్‌ మాదిరి పనిచేయనుంది. లోకల్‌ నెట్‌వర్క్ ద్వారా ఫైల్‌లను పంపవచ్చు. ఇందులో ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యేపుడు భద్రత కారణంగా సందేశాల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. 

ఇన్‌-యాప్‌ డయలర్

వాట్సప్‌ ఇన్-యాప్ కాల్ డయలర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌చేయని నంబర్‌కు నేరుగా వాట్సప్‌కాల్‌ చేయడం కుదరదు. కానీ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో నంబర్‌ సేవ్‌లో లేకపోయినా నేరుగా వాట్సప్‌లో కాల్‌ చేసేలా, మెసేజ్‌ చేసేలా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించి కంపెనీ చేస్తున్న కార్యకలాపాలు ఏ దశలో ఉన్నాయో స్పష్టంగా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement