
కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో నోయెల్ టాటా భేటీ
ఆయన వెంటే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
ట్రస్టీల మధ్య విభేధాల నేపథ్యంలో కీలక పరిణామం
బోర్డు నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలతో టాటా ట్రస్ట్స్‌లో అంతర్గతంగా ఆధిపత్య పోరు నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డేరియస్ ఖంబట్టా కూడా ఉన్నారు.
ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్‌నకు చాలా ప్రాధాన్యమున్న నేపథ్యంలో దాని పూర్తి నియంత్రణను ఏ ఒక్కరి చేతికో ఇవ్వడం శ్రేయస్కరమేనా కాదా అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలుగా మారిందని వివరించాయి. టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు టాటా సన్స్‌పైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి.
రెండు వర్గాలుగా ట్రస్టీలు..
156 ఏళ్ల దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ గొడుగు కింద 30 లిస్టెడ్ కంపెనీలతో పాటు 400 కంపెనీలు ఉన్నాయి. దీనిపై గణనీయంగా ప్రభావం చూపే.. టాటా ట్రస్ట్స్‌కి టాటా సన్స్‌లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్ బోర్డులో నియామకాలు, గవర్నెన్స్ అంశాల మీద వివాదం నెలకొంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టరుగా మాజీ డిఫెన్స్ కార్యదర్శి విజయ్ సింగ్ పునర్నియామకం కోసం సెప్టెంబర్ 11న జరిగిన ఆరుగురు ట్రస్టీల సమావేశంలో దీనికి బీజం పడింది. విజయ్ పేరును ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ ప్రతిపాదించగా, నలుగురు ట్రస్టీలు (మెహ్లి మిస్త్రీ, ప్రమిత్ ఝవేరీ, జహంగీర్ హెచ్‌సీ జహంగీర్, డేరియస్ ఖంబట్టా) వ్యతిరేకించారు. తదుపరి మెహ్లీ మిస్త్రీని నామినేట్ చేయాలంటూ ఆయన తరఫున ఉన్న నలుగురు ట్రస్టీలు ప్రతిపాదించగా, టాటా గ్రూప్ విలువలను ప్రస్తావిస్తూ దాన్ని నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ వ్యతిరేకించారు. దీనితో విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
కీలకమైన నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారంటూ మెహ్లీ మిస్త్రీ భావిస్తుండగా, ఆయన సారథ్యంలోని ట్రస్టీలంతా కలిసి.. ట్రస్ట్స్‌లో నోయెల్ టాటా ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గ్రూప్‌లో కొందరు భావిస్తున్నారు. టాటా సన్స్‌లో 18.37 శాతం వాటాలున్న షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి మెహ్లీ మిస్త్రీకి బంధుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం పోరు నడుమ ట్రస్టీలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు మరోసారి సమావేశం కానుండగా, అజెండా వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై టాటా ట్రస్ట్ టాటా సన్స్, వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్‌లో అత్యున్నత స్థాయిలో కొన్నాళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పటి గౌరవ చైర్మన్ రతన్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి చివరికి మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. ప్రస్తుతం రతన్ టాటా, మిస్త్రీ.. ఇద్దరూ మరణించారు.