World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు

WGC Report: Chain stores comprise 35percent of India retail gold jewellery market - Sakshi

రిటైల్‌ మార్కెట్లో 40 శాతానికి వాటా

వచ్చే ఐదేళ్లలో చేరుకుంటుంది

ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి

న్యూఢిల్లీ: భారత రిటైల్‌ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్‌ స్టోర్లు రిటైల్‌ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్‌ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్‌లో జ్యుయలరీ మార్కెట్‌ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్‌ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్‌లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది.  

సానుకూలతలు..
వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్‌ మార్కింగ్‌ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్‌టీ, డీమోనిటైజేషన్‌ ఇవన్నీ కూడా భారత్‌లో చైన్‌ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్‌ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది.  

నిర్మాణాత్మక మార్పులు
‘‘భారత రిటైల్‌ జ్యుయలరీ మార్కెట్‌ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్‌ మార్కింగ్‌ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్‌ స్టోర్లు మరింత మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈవో సోమసుందరం పీఆర్‌ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్‌ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్‌ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top