ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ తీరు ఎలా ఉంటుందంటే?

Weekly Stock Market Analysis - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, క్రూడాయిల్‌ ధరలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్‌ క్వార్టర్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభం నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం లేకపోలేదంటున్నారు. జూన్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా షార్ట్స్‌ కవర్‌ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్‌ 179 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడ్డాయి.  

‘‘అంతర్జాతీయ మార్కెట్లు స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్లైయితే బుల్స్‌ రిలీఫ్‌ ర్యాలీకి అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నా.., గతవారంలో అమ్మకాల ఉధృతి తగ్గడం శుభసూచకం. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్, రూపాయి కదలికలు ట్రెండ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నిఫ్టీ నష్టాల్లో ముగిసినా.., సాంకేతికంగా కీలకమైన మద్దతు 15,750 స్థాయిని నిలుపుకొంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,500 వద్ద మద్దతు లభించొచ్చు. ఎగువస్థాయిలో కొనుగోళ్ల జరిగితే 15,900 వద్ద  నిరోధాన్ని ఎదుర్కోనుంది. అటు పిదప 16,170–16,200 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ స్వస్తిక్‌ ఇన్వెస్ట్‌మార్ట్‌ హెడ్‌ రీసెర్చ్‌ సంతోష్‌ మీనా తెలిపారు. 

1. ఆర్థిక ఫలితాల సీజన్‌ ఆరంభం  
టీసీఎస్‌ శుక్రవారం జూన్‌(8న) క్వార్టర్‌ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. ‘‘అట్రిషన్‌ రేటు పెరగడంతో ఐటీ రంగం, మందగమనంతో మౌలికరంగం., సైక్లికల్స్‌ సెక్టార్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. అయితే ఆటో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల గణాంకాలు మెప్పించవచ్చు. కార్పొరేట్‌ ఫలితాల ప్రకటనకు ముందు స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది’’ అని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్‌తో పాటు పీటీసీ ఇండియా, జీఎం బేవరీజెస్, మైసూర్‌ పేపర్‌ మిల్స్, వక్రంజీ, కోహినూర్‌ ఫుడ్స్‌ తదితర కంపెనీలు ఈ వారంలో ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి.  

2. ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు  
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌(బుధవారం)తో పాటు జూన్‌ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. ఇదేవారంలో మంగళవారం యూరోజోన్‌ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ సర్వీసెస్‌ కాంపోసైట్‌ పీఎంఐ, బుధవారం కన్‌స్ట్రక్షన్‌ పీఎంఐ, మే మాసపు రిటైల్‌ అమ్మకాలు వెల్లడి కానున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. రష్యా – ఉక్రెయిన్‌ తాజా పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top