
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ మరోసారి భారీ డివిడెండ్‌ను వాటాదారులకు ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున 2022–23 సంవత్సరానికి మూడో మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని మంగళవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ రూపంలో కంపెనీ రూ.6,505 కోట్లను చెల్లించనుంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.58,597 కోట్లుగా ఉంది. రుణాలు తీర్చడానికి బదులు వాటాదారులకు భారీ మొత్తంలో డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి.
ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. దీంతో డివిడెండ్ రూపంలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ తేదీగా నవంబర్ 30ని ప్రకటించింది. వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ కింద రూ.31.50, రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.19.50 చొప్పున ఇవ్వడం గమనించాలి. ఈ మొత్తం కలిపి చూస్తే ఏడాది కాలంలో రూ.68.50 వరకు డివిడెండ్ కింద ఇచ్చినట్టయింది.