ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా | US military surged advanced drones regional contingency on Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా

Jan 14 2026 4:36 PM | Updated on Jan 14 2026 4:47 PM

US military surged advanced drones regional contingency on Iran

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎంక్యూ-4సీ ట్రైటాన్

జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.

సాధారణంగా సైనిక కార్యకలాపాల్లో ‘కాల్ సైన్’ (Call Sign) గోప్యంగా ఉంచుతారు(గాలిలో వందలాది విమానాలు ఎగురుతున్నప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్లు లేదా ఇతర సైనిక విమానాలు ఏ విమానంతో కాంటాక్ట్‌ అవుతున్నాయో స్పష్టంగా తెలియడానికి ఈ కాల్ సైన్లను ఉపయోగిస్తారు). కానీ, ఈసారి ట్రైటాన్ డ్రోన్లు తమ గోప్యతను దాచకుండా బహిరంగంగానే సంచరించడం గమనార్హం. ఇది ఇరాన్‌కు అమెరికా పంపిస్తున్న పరోక్ష హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇరాన్‌లో కల్లోలం - ట్రంప్ హెచ్చరిక

ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం స్వదేశీ నిరసనకారులపై అనుసరిస్తున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, నిరసనల అణిచివేతలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామని ట్రంప్ ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హింస కొనసాగితే ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.

తిరిగి వస్తున్న యుద్ధనౌకలు

గత ఏడాది హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్‌.ట్రూమాన్’, ఇతర విధ్వంసక నౌకలను గల్ఫ్‌లో మోహరించారు. అయితే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీటిని కరేబియన్ ప్రాంతానికి తరలించారు. కానీ, ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వైపు మళ్లిస్తున్నారు. యూఎస్ నేవీ అధికారిక సమాచారం ప్రకారం.. గైడెడ్-క్షిపణి యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్ (DDG 80) ఇప్పటికే అరేబియా గల్ఫ్‌కు చేరుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో ఈ నౌక తన పెట్రోలింగ్‌ను ప్రారంభించింది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలో అమెరికా డ్రోన్లు, యుద్ధనౌకలు మోహరించడం చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్‌ కీలక ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement