
యునైటెడ్ స్టేట్స్ నిర్దిష్ట దేశాల నుంచి కొంతమంది వీసా దరఖాస్తుదారులకు 12 నెలల వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని చూస్తుంది. వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని నిబంధనలు ఉపయోగించుకుంటూ, ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆగస్టు 20, 2025న ఈ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తేనున్నారు. దీని ప్రకారం..నిర్దిష్ట దేశాలకు చెందిన బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటక) వీసా దరఖాస్తుదారులు రిఫండబుల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు పుట్టిన దేశాన్ని బట్టి ఈ బాండ్ కోసం 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాలి. పెరుగుతున్న వలసలు, జాతీయ భద్రతపై ప్రమాదాన్ని గుర్తించి వీసా నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే దేశాలు
ఈ 12-నెలల వీసా బాండ్ పరిధిలోకి వచ్చే దేశాల వివరాలను ప్రాథమికంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
1. మలావి: ఈ దేశంలోని వారు బీ-1, బీ-2 కింద యూఎస్ వెళ్లాలంటే 15,000 డాలర్ల వరకు బాండ్ తీసుకోవాలి.
2. జాంబియా: 15,000 డాలర్ల వరకు బాండ్ అవసరం.
అమెరికా కొత్త వీసా ప్రోగ్రామ్ పరిధిలో ప్రస్తుతానికి భారత్ ఈ జాబితాలో లేదు. ఏదేమైనా ఈ పైలట్ ప్రోగ్రామ్‌లోని అంశాలను పరిగణించి క్రమంగా ఈ విధానాన్ని ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యూఎస్ అధికారులు సూచించారు.
ఈ బాండ్ ఎలా పని చేస్తుంది?
వీసా ఓవర్ స్టే(అధిక కాలంపాటు యూఎస్‌లో నివసించడం)ను నిరోధించడానికి, ప్రయాణీకులు వారి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఈ బాండ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కింద తెలుసుకుందాం.
వీసా అప్రూవల్ తర్వాతే బాండ్ అవసరం అవుతుంది. దరఖాస్తుదారులు యూఎస్ ట్రెజరీ Pay.gov ప్లాట్‌పామ్ ద్వారా బాండ్ చెల్లింపులు చేయాలి.
దరఖాస్తుదారులు తమ పుట్టిన దేశాన్ని బట్టి 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
వీసా నిబంధనలు పాటిస్తూ, వీసా గడువు ముగియకముందే అమెరికాను వీడే ప్రయాణికులకు బాండ్ పూర్తి రీఫండ్ లభిస్తుంది.
వీసా హోల్డర్ తమ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే (అనధికార ఉద్యోగం లేదా వారి వీసా పరిధినిదాటి కార్యకలాపాలు సాగిస్తే) బాండ్ జప్తు చేసుకుంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయాణికులు నిర్దేశిత విమానాశ్రయాల ద్వారానే యూఎస్‌లోకి ప్రయాణం సాగించాలి.
బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీఓఎస్)
న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (జేఎఫ్‌కే)
వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఏడీ)
భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..
ఓవర్ స్టే పరిమితంగానే..
ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పరిమితంగానే ‘ఓవర్ స్టే రేట్లు’ కలిగి ఉన్నారని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గుర్తించింది. బాండ్ అవసరాలకు సంబంధించి భవిష్యత్తు నిర్ణయాలను ఈ డేటా ప్రభావితం చేస్తుంది.
భవిష్యత్తు విస్తరణ
ఈ కార్యక్రమం పైలట్ పీరియడ్‌లో భారతదేశాన్ని చేర్చలేదు. అయితే ఇది శాశ్వతం మాత్రం కాదు. భారతీయ బీ -1 / బీ -2 దరఖాస్తుదారులు త్వరలో బాండ్ చెల్లించాలని కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ బ్రేక్
అసలు యూఎస్ సమస్య ఏంటి?
వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 2023లో యూఎస్‌లోకి వచ్చి అక్కడే నిలిచిపోతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా ఓవర్ స్టేలు హానికరం కానప్పటికీ, కొన్ని భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాటిని ట్రాక్ చేయడం కష్టం. సందర్శకులు, ఇతరులు సకాలంలో దేశం వదిలి వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ బాండ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. బాండ్ రీఫండబుల్.. సందర్శకులకు వీసా నిబంధనలను పాటించేలా చేస్తుంది.