Truth Social App: డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార చర్య

US former President Donald Trump Launched Truth Social App - Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాస్పద రాజకీయవేత్త, సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాగ్నెట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లతో ఢీ అంటే ఢీ అనేట్టుగా  సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త యాప్‌ను విడుదల చేశాడు. 

ట్రూత్‌ సోషల్‌
సోషల్‌ మీడియా దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించేందుకు సై అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. సోషల్‌ మీడియా యాప్‌ ఓనర్లు తన పట్ల వివక్ష చూపారని, ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఇంత కాలం ట్రంప్‌ ఆరోపిస్తూ వచ్చారు. కాగా ఈ రోజు సోషల్‌ మీడియా దిగ్గజాలకు పోటీగా తన కంపెనీ నుంచి ట్రూత్‌ సోషల్‌ పేరుతో ఓ యాప్‌ని రిలీజ్‌ చేశాడు.

ట్రంప్‌పై చర్యలు
2020 చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల తీరును విమర్శిస్తూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పలు కామెంట్లు చేశారు ట్రంప్‌. అయితే ఆ కామెంట్లు రెచ్చగొట్టే విధంగా విద్వేషంతో ఉన్నాయనే విమర్శలు నలువైపులా వచ్చాయి. దీంతో తమ నియమనిబంధనలకు విరుద్ధంగా ట్రంప్‌ కామెంట్లు ఉన్నాయంటూ ముందు ట్విట్టర్‌, తర్వాత ఫేస్‌బుక్‌లు ప్రకటించాయి. ట్రంప్‌ ఖాతాలపై చర్యలు తీసుకున్నాయి

దెబ్బకు దెబ్బ
ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లు తన పోస్టులపై చర్యలు తీసుకోవడంతో ట్రంప్‌ ఆగ్రహం చెందారు. దీంతో ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ను 2021 అక్టోబరులో స్థాపించాడు. ఈ గ్రూపు ఇటీవల ట్రూత్‌ సోషల్‌ యాప్‌ను రూపొందించింది. 2022 ఫిబ్రవరి 20 సాయంత్రం యాపిల్‌ ఆప్‌ స్టోర్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. మార్చి చివరి నాటికి అన్ని ప్లాట్‌ఫార్మ్‌లపై అందరికీ అ యాప్‌ అందుబాటులోకి ఉంటుందని ప్రకటించారు.

ట్రూత్‌కి ట్రంప్‌ తోడైతే
సోషల్‌ మీడియాలో రోజుకో యాప్‌ వస్తున్నా ప్రధానంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌లనే అగ్రస్థానం. ఇప్పుడు వాటికి పోటీగా ట్రంప్‌ కొత్త యాప్‌ను తీసుకువచ్చారు. ఈ యాప్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండగలిగితే.. ట్రంప్‌కి ఉన్న ఆర్థిక సంపత్తితో ఈ యాప్‌ సంచలనం సృష్టించడం ఖాయం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top