స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ ఓకే

Union cabinet approves Spectrum auction and sugar subsidies - Sakshi

చక్కెర ఎగుమతి సబ్సిడీలకూ గ్రీన్‌సిగ్నల్‌

అమ్మకానికి పలు బ్యాండ్ల రేడియో వేవ్స్‌ రెడీ

అందుబాటులోకి రానున్న 5జీ సర్వీసుల స్పెక్ట్రమ్‌

కేంద్ర కేబినెట్‌ తాజా నిర్ణయాలు

న్యూఢిల్లీ, సాక్షి: వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సమావేశమైన కేంద్ర కేబినెట్‌ తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయం, టెలికం, విద్యుత్‌ రంగాలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించింది. కొద్ది రోజులుగా రైతుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా ఐదు కోట్లమంది రైతులు, ఐదు లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. సొమ్మును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు తెలియజేశారు. గత రెండు, మూడేళ్లుగా చక్కెర ఉత్పత్తి మిగులుకు చేరుకున్నందున ధరలు దిగివచ్చినట్లు తెలియజేశారు. ఈ సీజన్‌(2020-21 అక్టోబర్‌- సెప్టెంబర్‌)లో రూ. 3,600 కోట్ల సబ్సిడీలను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. (4 నెలల్లో 4 బిలియన్‌ డాలర్ల దానం)

స్పెక్ట్రమ్ వేలం
2016 తదుపరి స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. 700 ఎంహెచ్‌జెడ్‌ మొదలు, 800, 900, 2100, 2300, 2500 ఎంహెజెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేశారు. 20ఏళ్ల గడువుతో వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 2,251కుపైగా ఎంహెచ్‌జెడ్‌ రేడియో తరంగాలను విక్రయానికి ఉంచనున్నట్లు తెలియజేశారు. తద్వారా రూ. 3.92 లక్షల కోట్లకుపైగా లభించవచ్చని అంచనా వేశారు. 2021 మార్చిలో వేలాన్ని చేపట్టే వీలున్నట్లు వెల్లడించారు. వేలం విజేతలు ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లింపులు చేపట్టవచ్చని తెలియజేశారు.

5జీ ఇలా
టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) 5జీ సర్వీసులకు 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. అయితే రక్షణ శాఖ 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించుకోనుంది. దీంతో 175 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ మాత్రమే అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశవ్యాప్త ప్రాతిపదికన ట్రాయ్ 3300-3600 ఎంహెచ్‌జెడ్‌ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్‌జెడ్‌కుగాను రూ. 492 కోట్లను బేస్‌ ధరగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 100 ఎంహెచ్‌జెడ్‌ 5జీ వేవ్స్‌కుగాను రూ. 50,000 కోట్లు లభించవచ్చని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top