సూపర్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!

Ultra Luxury Car Sales Growth Will Be Much Better This Year - Sakshi

ఒక్కోటి రూ.2 కోట్లకుపైగా ఖరీదు 

గతేడాది 450 యూనిట్లు అమ్మకం 

2030లో 30 శాతం వృద్ధికి ఆస్కారం 

మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ టెక్‌సీ అంచనా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అల్ట్రా లగ్జరీ కార్లు భారత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్నాయి. లగ్జరీ కార్లకు మారుపేరైన రోల్స్‌ రాయిస్, ఆస్టన్‌ మార్జిన్, లంబోర్గీని, ఫెరారీ, బెంట్లే, పోర్ష.. అన్నీ కూడా 2022లో అత్యధిక అమ్మకాలను సాధించాయి. భారత్‌లో ఈ కంపెనీలు అల్‌ టైమ్‌ హై విక్రయాలను గతేడాది నమోదు చేయడం గమనార్హం. 2023లో సైతం ఇదే స్థాయిలో సేల్స్‌ ఉంటాయని ధీమాగా ఉన్నాయి. కోవిడ్‌–19 నేపథ్యంలో రెండేళ్లుగా విదేశీ టూర్లు వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమైన బిలియనీర్లు, మిలియనీర్లు ఖరీదైన ఇళ్లు, వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ‘కోవిడ్‌ తర్వాత ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. మహమ్మారి చాలా మందికి షాక్‌ ఇచ్చింది. ధనవంతులుగా చనిపోయే బదులు ధనవంతులుగా జీవించాలని అనుకుంటున్నారు’ అని ఒక డీలర్‌ వ్యాఖ్యానించారు.  

కొనడంలో తగ్గేదే లే.. 
యూఎస్, చైనాతో పోలిస్తే అల్ట్రా లగ్జరీ కార్ల విపణి భారత్‌లో స్వల్పమే. సంపన్నుల నుంచి వీటికి డిమాండ్‌ నేపథ్యంలో అమ్మకాల వేగం పెరిగింది. విదేశాల్లో లభిస్తున్న మోడళ్లను ఇక్కడి కస్టమర్లు కోరుకుంటున్నారు. లగ్జరీ కార్ల మార్కెట్లో రూ.2 కోట్లు ఆపైన ఖరీదు చేసే అల్ట్రా మోడళ్ల అమ్మకాలు 2022లో 450 యూనిట్లు. ఇప్పటి వరకు భారత్‌లో ఇదే అత్యధికం. 2021లో 300 యూనిట్లు రోడ్డెక్కాయి. అంటే గతేడాది ఈ మార్కెట్‌ 50 శాతం వృద్ధి సాధించింది అన్నమాట. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 30 శాతం వృద్ధితో 580 యూనిట్లు దాటుతుందని మార్కెట్‌ రిసర్చ్‌ కంపెనీ టెక్‌సీ రిసర్చ్‌ అంచనా. 2018లో భారత్‌లో 325 అల్ట్రా లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. బెంట్లే ఇటీవలే భారత్‌లో సరికొత్త బెంటేగా ఎక్స్‌టెండెడ్‌ వీల్‌బేస్‌ ఎస్‌యూవీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6 కోట్లు.  

సుంకాలే అడ్డంకి.. 
‘అధిక దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా అల్ట్రా లగ్జరీ కార్లు భారత్‌లో అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే ఇటువంటి కారును కలిగి ఉండటం లగ్జరీ, ప్రతిష్ట అని భావించే వినియోగదారులను అధిక సుంకాలు, పన్నులు నిరోధించలేవు’ అని టెక్‌సీ డైరెక్టర్‌ కరన్‌ ఛేసి వ్యాఖ్యానించారు. ‘దేశంలో అల్ట్రా లగ్జరీ కార్ల విభాగం పెరుగుతోంది. అధిక దిగుమతి సుంకాలు మాత్రమే పరిశ్రమ వృద్ధికి అడ్డంకిగా ఉన్నాయి. క్రమంగా ప్రభుత్వం పన్నులను హేతుబద్ధం చేస్తుందని ఆశిస్తున్నాం. ఇది జరిగితే ఏటా 1,000 యూనిట్లను కూడా విక్రయించగలం’ అని భారత్‌లో బెంట్లే డీలర్‌ అయిన ఎక్స్‌క్లూజివ్‌ మోటార్స్‌ ఎండీ సత్య బగ్లా ధీమా వ్యక్తం చేశారు.  

ఒకదాన్ని మించి ఒకటి.. 
సూపర్‌ లగ్జరీ కార్ల విక్రయంలో ఉన్న కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి భారత్‌లో పోటీపడుతున్నాయి. 2007లో దేశీయ మార్కెట్‌లో 2007లో లంబోర్గీని ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు భారత్‌లో ఈ కంపెనీ 400 యూనిట్లు విక్రయించింది. గతేడాది 30 శాతం వృద్ధితో 92 లంబోర్గీని కార్లు రోడ్డెక్కాయి. ఈ కంపెనీ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉందట. 2023లో 100 యూనిట్ల మార్కును చేరుకుంటామని కంపెనీ ధీమాగా ఉంది. లంబోర్గీని కార్ల ఖరీదు రూ.3.8 కోట్లకుపైమాటే. 2022లో పోర్ష 64 శాతం అధికంగా 779 యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2014 నుంచి చూస్తే కంపెనీకి ఇదే అత్యధిక విక్రయాలు. 40 శాతంపైగా వృద్ధితో ఈ ఏడాది 60 యూనిట్ల స్థాయికి చేరుకోవాలని బెంట్లే లక్ష్యంగా చేసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top