
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని.. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. ఈ తరుణంలోనే రెండు ప్రధాన అమెరికన్ కంపెనీలు తమ సీఈఓలు(CEO)గా భారతీయుల పేర్లను ప్రకటించాయి.
అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ (T-Mobile).. సీఈఓగా 'శ్రీని గోపాలన్' పేరును ప్రకటించింది. ప్రస్తుతం టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీని.. నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.
గోపాలన్.. హిందూస్తాన్ యూనిలీవర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్‌లలో సీనియర్ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న కంపెనీకే (టీ-మొబైల్) సీఈఓగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
చికాగోకు చెందిన పానీయాల దిగ్గజం.. మోల్సన్ కూర్స్ (Molson Coors) కూడా తన సీఈఓగా రాహుల్ గోయల్‌ను నియమించింది. అక్టోబర్ 1నుంచి ఈయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోయల్ అన్నారు. ఈయన మైసూర్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. భారతదేశంలోని కూర్స్, మోల్సన్ బ్రాండ్‌లలో మాత్రమే కాకుండా ఈయన కొన్నాళ్లు యూకేలో కూడా పనిచేశారు.