తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించాలని ప్రతి తల్లిదండ్రులు ఆరాటపడతారు. వారి కోసం డబ్బులు పోగుచేస్తారు. చాలా మంది ఆస్తులు సైతం కొంటుంటారు. అయితే పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేస్తే చట్టపరమైన హక్కులు, వారసత్వం, పన్నులు, సంరక్షణ వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీలునామా, గార్డియన్‌షిప్, పన్ను నిబంధనలు స్పష్టంగా ఉండాలి.
పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి బాలల దినోత్సవం (Children's Day) సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
చట్టపరమైన హక్కులు
పిల్లల పేరు మీద ఆస్తి కొంటే, ఆ ఆస్తి పిల్లలకే హక్కుగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆ ఆస్తికి కేవలం సంరక్షకులుగా (Guardians) మాత్రమే ఉండగలరు. పిల్లలు పెద్దవారయ్యాక (18 ఏళ్లు పూర్తయ్యాక) ఆ ఆస్తిపై పూర్తి హక్కు పొందుతారు.
వీలునామా అవసరం
తల్లిదండ్రులు వీలునామా రాయకపోతే, హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఆస్తి వారసత్వంగా ఇతర పిల్లలకు కూడా పంచబడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆస్తి ఎవరికీ చెందాలో స్పష్టంగా చెప్పే వీలునామా రాయడం చాలా అవసరం.
పన్నులు
పిల్లల పేరు మీద ఆస్తి కొనుగోలు చేసినా, ఆ ఆస్తి నుండి వచ్చే ఆదాయం అంటే అద్దెలు, వడ్డీలు వంటివి తల్లిదండ్రుల ఆదాయంలో కలిపి చూస్తారు. ఆ మేరకు పన్ను వర్తిస్తుంది. పిల్లలు పెద్దవారయ్యాక మాత్రమే ఆ ఆదాయం వారి పేరుతో పరిగణించబడుతుంది.
గార్డియన్‌షిప్
పిల్లలు మైనర్‌గా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఆస్తిని నిర్వహించాలి. ఆస్తి అమ్మకం, లీజ్, లేదా మార్పిడి చేయాలంటే కోర్టు అనుమతి అవసరం.
భవిష్యత్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు
ఆస్తి కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు పిల్లల పేరుతో సరిగా నమోదు చేయాలి. భవిష్యత్‌లో తోబుట్టువుల మధ్య వివాదాలు రాకుండా వీలునామా తప్పనిసరిగా ఉండాలి. ఆదాయం, పన్నులు, వారసత్వం విషయంలో ముందుగానే ప్రణాళిక అవసరం.


