Halwa Ceremony: రహస్యంగా బడ్జెట్‌ తయారీ.. అజ్ఞాతంలోకి ‘బడ్జెట్‌’ ఉద్యోగులు.. ఇవీ కారణాలు

These Are The Reasons Behind No Halwa Ceremony Before Union budget - Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. బడ్జెట్‌ తయారీ సందర్భంగా అనాదిగా పాటిస్తున్న కల్చర్‌కి పులిస్టాప్‌ పెట్టారు. ఎప్పుడూ నిర్వహించే హల్వా సెరిమొని పక్కన పెట్టి రెగ్యులర్‌ స్వీట్లను పంచడంతో బడ్జెట్ పనులు మొదలు పెట్టారు. 70 ఏళ్లకు పైగా కొనసాగిస్తూ వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి.

తీపి తిన్నాకే
ఆర్థిక శాఖలో బడ్జెట్‌ ముద్రణలో పాల్గొనే అధికారులు హల్వా కార్యాక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక శాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్లో ఓ పెద్ద కడాయిలో హల్వాను తయారు చేస్తారు. బడ్జెట్‌ తయారీ, ముద్రణ పనుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి కడాయిలోని హల్వాను ఆర్థిక మంత్రి స్వయంగా పంచిపెడతారు. హల్వా రుచుల ఆరగించిన తర్వాత బడ్జెట్‌ ఉద్యోగులను అజ్ఞాతంలోకి పంపిస్తారు. 

కరోనా ఉన్నా..
కరోనా సంక్షోభం మొదలైన తర్వాత జనం గుమిగూడే కార్యక్రమాలు చాలా ఆగిపోయాయి. ఐనప్పటికీ 2021-22 బడ్జెట్‌ సందర్భంగా కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్‌. ఫైనాన్స్‌ అధికారులు, ఉద్యోగులు ఇతర సిబ్బంది ఈ హల్వా కార్యక్రమంలో హుషారు పాల్గొన్నారు. డెబ్బై ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న  అలవాటుకు తాజాగా ఒమిక్రాన్‌ బ్రేక్‌ వేసిందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 

జస్ట్‌ ఫర్‌ చేంజ్‌
హల్వాయి ప్రోగ్రామ్‌ ఈసారి లేకపోవడానికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఒక కారణమైతే బడ్జెట్‌ తయారీ ఇప్పుడు పేపర్‌ లెస్‌గా మారడం మరో కారణం.  అయితే గతేడాది నుంచి బడ్జెట్‌ ప్రతుల ముద్రణకి పులిస్టాప్‌ పెట్టారు.  డిజిటల్‌కి షిఫ్ట్‌ అయ్యారు. ట్యాబ్‌లో చూసి చదువుతూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో అనాదిగా వస్తున్న హల్వా తయారీ సంప్రదాయాన్ని ఈసారి పక్కన పెట్టారు.  2022 జనవరి 27 గురువారం బడ్జెట్‌ తయారీ పనులు లాంఛనంగా మొదలయ్యాయి. బడ్జెట్‌ తయారీలో పాల్గోనే అధికారులు సిబ్బందికి హల్వా తినిపించేందుకు ఈసారి ఆర్థిక మంత్రి రాలేదు. బడ్జెట్‌ సిబ్బందికి కేవలం స్వీట్స్‌ పంచడంతో సరిపెట్టారు.

అజ్ఞాత వాసం
బడ్జెట్‌ తయారీ, ముద్రణ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఒక్క సారి హల్వా/స్వీట్‌ తిన్నారంటే పది రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. బడ్జెట్‌ తయారీ విధుల్లో పాల్గోనే వారు హల్వా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్తారు.  తిరిగి ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం పూర్తి చేసిన తర్వాతే బయటకు అనుమతిస్తారు. అప్పటి వరకు కుటుంబాలకు, ఆఫీసులకు దూరంగా ఉంటారు. ఆఖరికి మొబైల్‌ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వరు. 

నార్త్‌బ్లాక్‌లోనే
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్‌ తయారీ ప్రతుల ముద్రణ రాష్ట్రపతి భవన్‌లో జరిగేది. అయితే 1950లో పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందే అందులో కీలక అంశాలు లీక్‌ అయ్యాయి. దీంతో బడ్జెట్‌ తయారీ, ముద్రణా వ్యవహారాలను ఆర్థిక శాఖ ఉన్న నార్త్‌బ్లాక్‌కి మార్చేశారు. 1950 నుంచి 2022 వరకు ప్రతీ బడ్జెట్‌ తయారీ పనులు నార్త్‌బ్లాక్‌లోనే జరుగుతున్నాయి.  నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ తయారయ్యే విభాగం నుంచి పూచికపుల్లను కూడా బయటకు రానీవ్వరు. 

చదవండి: బడ్జెట్‌ సమావేశాలపై బులెటిన్‌ విడుదల

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top