టెల్కోలకు రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌! రైల్వే భూమిలో టెలికం టవర్లు 

Telecom Towers Can Now Be Deployed In Railway Owned Properties - Sakshi

ఇక ప్రయివేట్‌ కంపెనీలకు చాన్స్‌

సర్వీసులకూ రైల్వే శాఖ ఓకే...

కొత్తగా భూముల లీజ్‌ పాలసీ

దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌కు బూస్ట్‌  

రైల్వే సంబంధ భూములలో రైల్‌టెల్‌ కార్పొరేషన్‌కు మినహా ఏ ఇతర టెలికం కంపెనీలూ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ అనుమతించడం లేదు. అయితే తాజాగా ఇందుకు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా భూములకు కొత్త లీజ్‌ విధానాలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దేశీయంగా 5జీ టెలికం నెట్‌వర్క్‌ ఊపందుకునే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

న్యూఢిల్లీ: ర్వైల్వే భూములకు సంబంధించి ల్యాండ్‌ లైసెన్సింగ్‌ ఫీజు(ఎల్‌ఎల్‌ఎఫ్‌) నిబంధనలను కొద్ది నెలల క్రితం కేంద్ర క్యాబినెట్‌ సరళీకరించింది. వెరసి ప్రయివేట్‌ రంగం నుంచి పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో రైల్వే శాఖ కొత్త ఎల్‌ఎల్‌ఎఫ్‌ పాలసీకి తెరతీసింది. దీంతో మొబైల్‌ టవర్ల ఆదాయంలో 7 శాతాన్ని పంచుకునే నిబంధనలకు తెరదించింది.

దీని స్థానే భూముల మార్కెట్‌ విలువలో వార్షికంగా 1.5 శాతం చార్జీల విధింపునకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌ విస్తరణకు దారి ఏర్పడనుంది. దీనిలో భాగంగా అనుమతులు మంజూరు చేసే అంశంలో భవిష్యత్‌ నెట్‌వర్క్‌ అవసరాలను పరిగణించేలా జోనల్‌ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.  

రైల్‌టెల్‌ మాత్రమే... 
ప్రస్తుతం రైల్వే  రంగ టెలికం అవసరాలకు రైల్‌టెల్‌ కార్పొరేషన్‌పై మాత్రమే ఆ శాఖ ఆధారపడుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయివేట్‌ రంగ కంపెనీలకూ టెండర్లను ప్రారంభించినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని ఆయా సంస్థలు వాణిజ్యంగా వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఇదే సమయంలో ఈ మౌలిక సదుపాయాలను పోటీ ధరల ప్రాతిపదికన రైల్వేలు సైతం ఉపయోగించుకోనున్నాయి. 2016 పాలసీ ప్రకారం రైల్వే భూములలో రైల్‌టెల్‌కు మాత్రమే టవర్ల ఏర్పాటుకు వీలుండేది. తాజా విధానాలు వీటికి స్వస్తి పలికాయి. వీటి ప్రకారం 70 డివిజన్లు కార్యాలయాలు, స్టేషన్‌ పరిసరాలలో పోల్‌ మౌంట్లు, స్మాల్‌ సెల్స్‌ ఏర్పాటుకు అనుమతించనున్నాయి.  

రెండు నెలల గడువు 
సొంత నెట్‌వర్క్‌లో 5జీ సర్వీసుల వృద్ధికి కొద్ది రోజులుగా రైల్వే శాఖ ప్రయివేట్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే భూములలో ప్రయివేట్‌ టెలికం కంపెనీలు టవర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతించడంతో  వ్యయాలు తగ్గనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా సామర్థ్య మెరుగుకు ఊతం లభించడంతోపాటు, అత్యుత్తమ గ్రిడ్‌ ప్రణాళికలకు వీలున్నట్లు తెలియజేశాయి.

రైల్వేలకు ఆయా భూములు అవసరమైనప్పుడు రెండు నెలల నోటీసు ద్వారా తిరిగి సొంతం చేసుకునే నిబంధనలు జత చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 5జీ టవర్ల ఏర్పాటుకు మొబైల్‌ సేవల దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ భూముల కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజా నిర్ణయాలు పరిశ్రమకు బూస్ట్‌నివ్వనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో స్థానిక నెట్‌వర్క్‌లకు మరింత బలిమి చేకూరే వీలుంది. ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ దూర ప్రాంతాల రైల్వే స్థలాలలో టవర్ల ఏర్పాటు కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదని పరిశ్రమ నిపుణులు వివరించారు.

తద్వారా టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటులో మరిన్ని ప్రణాళికలకు తెరలేస్తుందన్నారు. ఇది టెలికం పరిశ్రమ నుంచి చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే టవర్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవడం, రైల్వేకు తిరిగివ్వడం వంటి కొన్ని అంశాలలో సమస్యలను పరిష్కరించవలసి ఉన్నట్లు తెలియజేశారు.   

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top