
88 శాతం కంపెనీలు సానుకూలం
టీమ్‌లీజ్ ‘కెరీర్ అవుట్‌లుక్ నివేదిక’ వెల్లడి
ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు తలుపుతట్టనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో (జులై–డిసెంబర్) ప్రెషర్లను అధికంగా నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నిర్వహించిన ‘కెరీర్ అవుటులుక్ రిపోర్ట్’ సర్వేలో.. ఈ–కామర్స్, టెక్ స్టార్టప్‌ల్లో 88 శాతం కంపెనీలు నియామకాల ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశాయి. వీటి తర్వాత రిటైల్ రంగంలో 87 శాతం, తయారీ రంగంలో 82 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూల ధోరణితో ఉన్నాయి.
యువ నిపుణులకు ఉన్న బలమైన డిమాండ్‌ను ఇది సూచిస్తున్నట్టు టీమ్‌లీజ్ తెలిపింది. ఈ కామర్స్, టెక్నాలజీ రంగాల్లో చురుకైన వృద్ధి ఫ్రెషర్లకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలు పెరుగుతుండడం, ప్రత్యక్ష, నైపుణ్య ఆధారిత అధ్యయన మార్గాల డిమాండ్‌ను తెలియజేస్తున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. వివిధ రంగాల్లోని 1,065 కంపెనీలను మే నుంచి జులై మధ్య ప్రశ్నించి ఈ వివరాలను టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ విడుదల చేసింది.
అయితే, ఫ్రెషర్ల నియామక ఉద్దేశం కంపెనీల్లో బలంగానే ఉన్నప్పటికీ.. క్రితం ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోల్చి చూస్తే కాస్తంత తగ్గడం గమనార్హం. 2024 ద్వితీయ ఆరు నెలల్లో 74 శాతంగా ఉంటే, ఈ ఏడాది ద్వితీయ ఆరు నెలలకు ఇది 70 శాతంగా ఉంది. ఏఐ రాకతో మానవ వనరుల పునర్‌వ్యవస్థీకరణ, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు, కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను కాపాడుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.
అధిక వృద్ధి రంగాల్లో అవకాశాలు
అధిక వృద్ధిని నమోదు చేస్తున్న రంగాల్లో ఫ్రెషర్లకు అవకాశాలు బలంగానే ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదిక తెలిపింది. డిగ్రీ అప్రెంటిస్ షిప్‌లకు తయారీలో 37 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాలో 29 శాతం, ఐటీలో 18 శాతం చొప్పున డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరులోని కంపెనీల్లో 37 శాతం, చెన్నైలో 30 శాతం, పుణెలో 26 శాతం చొప్పున కంపెనీలు అప్రెంటిస్‌షిప్‌ల నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. పెద్ద సంస్థలతో పోల్చి చూసినప్పుడు చిన్న కంపెనీలు ఫ్రెషర్ల నియామకంపై అధిక ఆసక్తితో ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ