Tata Motors Mou With Ford: టాటా చేతికి ఫోర్డ్‌ ఇండియా ప్లాంట్‌

Tata Motors signs MoU for potential acquisition of Ford India - Sakshi

సాణంద్‌లోని ఫ్యాక్టరీ కొనుగోలు

గుజరాత్‌ ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం

న్యూఢిల్లీ: అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సాణంద్‌లో ఉన్న ప్లాంటును కొనుగోలు చేస్తున్నట్లు దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్‌ ఇండియా (ఎఫ్‌ఐపీఎల్‌), గుజరాత్‌ ప్రభుత్వం, టాటా మోటర్స్‌ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (టీపీఈఎంఎల్‌) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం స్థలం, భవంతులు, వాహనాల తయారీ ప్లాంటు, యంత్రాలు, పరికరాలు మొదలైనవి టీపీఈఎంఎల్‌ కొనుగోలు చేయనుంది.

అలాగే, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఎఫ్‌ఐపీఎల్‌ సాణంద్‌ ప్లాంటులోని వాహనాల తయారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే, అర్హత కలిగిన ఉద్యోగులు కూడా టీపీఈఎంఎల్‌కు బదిలీ అవుతారు. తదుపరి కొద్ది వారాల వ్యవధిలోనే టీపీఈఎంఎల్, ఎఫ్‌ఐపీఎల్‌ పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. సాణంద్‌ ప్లాంట్‌లో ఇంజిన్ల తయారీని ఫోర్డ్‌ కొనసాగించనుండటంతో అందుకు అవసరమైన స్థలాన్ని ఆ కంపెనీకి టాటా మోటార్స్‌ లీజుకు ఇవ్వనుంది. నీరు, విద్యుత్, వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంటు మొదలైనవి రెండు సంస్థలు కలిసి వినియోగించుకోనున్నాయి.

కొత్త పెట్టుబడులు..
తమ వాహనాల ఉత్పత్తికి అనువుగా యూనిట్‌ను సిద్ధం చేసే దిశగా టీపీఈఎంఎల్‌ కొత్త యంత్రాలు, పరికరాలపై ఇన్వెస్ట్‌ చేయనుంది. తద్వారా ఏటా 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా ప్లాంటును తీర్చిదిద్దనుంది. తర్వాత రోజుల్లో దీన్ని 4 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోనుంది. ‘మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కొద్ది నెలలు పడుతుంది. ప్యాసింజర్, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది మాకు తోడ్పడుతుంది.

పైగా సాణంద్‌లోని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ప్లాంటుకు పక్కనే ఈ యూనిట్‌ ఉండటం కూడా మాకు కలిసి వస్తుంది‘ అని టాటా మోటార్స్‌ పేర్కొంది. ‘టాటా మోటార్స్‌కు దశాబ్ద కాలం పైగా గుజరాత్‌తో అనుబంధం ఉంది. సాణంద్‌లో సొంత తయారీ ప్లాంటు ఉంది. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు ఈ ఒప్పందమే నిదర్శనం‘ అని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్, టీపీఈఎంఎల్‌ ఎండీ శైలేష్‌ చంద్ర తెలిపారు. తమ వాహనాలకు కొనుగోలుదారుల్లో డిమాండ్‌ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా కంపెనీ అనేక రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు.

ఉద్యోగులకు భరోసా..
2011లో ఫోర్డ్‌ ఇండియా సాణంద్‌లోని ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారీ యూనిట్‌ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు దేశీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమైన ఫోర్డ్‌ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై దిగుమతి చేసుకున్న వాహనాలు మాత్రమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, తాజా ఒప్పందంతో ఆ సమస్య తప్పుతుందని గుజరాత్‌ ప్రభుత్వం  తెలిపింది. ‘ఫోర్డ్‌ ప్లాంటు మూసివేతతో 3,000 మంది పర్మనెంటు ఉద్యోగులు, 20,000 మంది వర్కర్లతో పాటు కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే అనుబంధ సంస్థల్లో ను భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పడే పరిస్థితి నెలకొంది. కానీ, ప్రస్తుత ఒప్పందంతో ఆ సమస్య పరిష్కారమవుతుంది‘ అని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top