రివ్వున దూసుకుపోయిన టాటా మోటార్స్‌ షేర్లు

TATA Motors Share Touches High In Nifty Intraday Trading - Sakshi

టాటా మోటార్స్‌ ఈవీకి భారీ నిధులు

రూ. 7,550 కోట్ల తాజా పెట్టుబడులు 

షేర్లుగా మార్పిడయ్యే సెక్యూరిటీల జారీ 

టీపీజీ రైజ్‌ క్లయిమేట్,     ఏడీక్యూలకు వాటా   

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలో టాటా మోటార్స్‌ షేరు 1.3 శాతం బలపడింది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీకి ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో ఏడీక్యూతో కలిపి టీపీజీ రైజ్‌ క్లయిమేట్‌ బిలియన్‌ డాలర్లు (రూ. 7,550 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా టాటా షేర్లు జూమ్‌మంటూ దూసుకుపోయాయి. దీంతో షేర్‌ వాల్యూ గరిష్టంగా రూ. 421 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో అయితే  రూ. 436 సమీపంలో ట్రేడయ్యి 52 వారాల గరిష్టాన్ని తాకింది.

భారీ పెట్టుబడి
ఎలక్ట్రిక్‌ వాహన తయారీకి ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో ఏడీక్యూతో కలిపి టీపీజీ రైజ్‌ క్లయిమేట్‌ బిలియన్‌ డాలర్లు(రూ. 7,550 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు టాటా మోటార్స్‌ తాజాగా పేర్కొంది. తద్వారా 11–15 శాతం మధ్య వాటాను పొందనున్నట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ తెలియజేసింది. 9.1 బిలియన్‌ డాలర్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో తాజా పెట్టుబడులు లభిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. భవిష్యత్‌లో షేర్లుగా మార్పిడయ్యే(తప్పనిసరి) సెక్యూరిటీల జారీ ద్వారా ఈవీ అనుబంధ సంస్థలో ఏడీక్యూ, టీపీజీ రైజ్‌ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 18 నెలల్లోగా రెండంచెలలో పెట్టుబడులు లభించనున్నట్లు తెలియజేసింది. అబుధాబి ప్రభుత్వానికి వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించే ఏడీక్యూ దేశ, విదేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది.  
ప్రధాన పాత్రకు సిద్ధం 
తమ ఎలక్ట్రిక్‌ వాహన ప్రయాణంలో టీపీజీ రైజ్‌ క్లయిమేట్‌ జత కలవడం ఆనందాన్నిస్తున్నట్లు టాటా మోటార్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. తద్వారా దేశీ మార్కెట్లో మార్పులు తీసుకురాగల ఈవీ విభాగంలో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా ఎలక్ట్రిక్‌ వాహన వాటాను 30 శాతానికి పెంచే ప్రభుత్వ ప్రణాళికలు(విజన్‌)కు అనుగుణంగా ప్రధాన పాత్రను పోషించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. టాటా మోటార్స్‌కున్న ప్రస్తుత పెట్టుబడులు, సామర్థ్యాలను కొత్త ఈవీ కంపెనీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌ పెట్టుబడులను ఎలక్ట్రిక్‌ వాహనాలు, బీఈవీ ప్లాట్‌పామ్స్, అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీలు, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, బ్యాటరీల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో 10 ఈవీలతోకూడిన పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. టాటా పవర్‌ భాగస్వామ్యంతో ఛార్జింగ్‌ మౌలికసదుపాయాలను వేగవంతంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా ఈవీలకు భారీ అవకాశాలున్నట్లు టీపీజీ రైజ్‌ క్లయిమేట్‌ వ్యవస్థాపక భాగస్వామి జిమ్‌ కౌల్టర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వ విధానాలు ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: అదృష్టమంటే ఇదేనేమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top