టాటా దూకుడు: ఏవియేషన్‌ మార్కెట్లో సంచలనం

Tata group to Merge Vistara With Air India - Sakshi

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు  25.1 శాతం వాటా 

2024 మార్చి కల్లా డీల్‌ పూర్తి: టాటా గ్రూప్‌ 

న్యూఢిల్లీ: దేశీ ఏవియేషన్‌ మార్కెట్లో భారీ కన్సాలిడేషన్‌కు తెర తీస్తూ ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నట్లు టాటా గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. ఒప్పందం ప్రకారం ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు  25.1 శాతం వాటా దక్కనుంది. ఈ డీల్‌ 2024 మార్చి నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్‌ఐఏ) 49 శాతం వాటాలు ఉన్నాయి.

ఈ కన్సాలిడేషన్‌తో దేశ, విదేశ రూట్లలో అత్యధికంగా సర్వీసులు నడిపిస్తున్న భారీ ఎయిర్‌లైన్స్‌గా ఎయిరిండియా ఆవిర్భవిస్తుందని టాటా గ్రూప్‌ తెలిపింది. అంతర్జాతీయ రూట్లకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద సంస్థగాను, దేశీ రూట్లలో రెండో పెద్ద సంస్థగాను ఎయిరిండియా ఉంటుందని వివరించింది. విలీనానంతరం సంస్థ చేతిలో 218 విమానాలు ఉంటాయి. విలీన ఒప్పందం కింద ఎయిరిండియాలో రూ. 2,058.5 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఎస్‌ఐఏ తెలిపింది. తద్వారా తమకు ఎయిరిండియాలో 25.1 శాతం వాటా లభిస్తుందని, అలాగే అన్ని కీలక మార్కెట్‌ 
విభాగాల్లోనూ తమకు గణనీయంగా చోటు దక్కుతుందని పేర్కొంది.  

కీలక మైలురాయి .. 
ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దే క్రమంలో రెండు సంస్థల విలీనం కీలక మైలురాయి వంటిదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా ఇటు నెట్‌వర్క్‌ను, అటు విమానాలను పెంచు కోవడంపై, కస్టమర్లకు అందించే సర్వీసులు మెరుగుపర్చుకోవడంపై, భద్రత.. విశ్వసనీయత.. సమయ పాలనను మెరుగు పర్చుకోవడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఆయన చెప్పారు. టాటా గ్రూప్‌తో సంబంధాలను మరింత పటిష్టపర్చుకునేందుకు, దేశీ ఏవియేషన్‌ మార్కెట్‌ వృద్ధిలో పాలుపంచుకునేందుకు ఈ విలీనం చక్కని అవకాశం కాగలదని ఎస్‌ఐఏ సీఈవో గోహ్‌ చూన్‌ ఫోంగ్‌ తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయని విస్తారా సీఈవో వినోద్‌ కణ్ణన్‌ చెప్పారు. ఎయిరిండియా రూపాంతరం చెందే ప్రయత్నాలకు విలీన ఒప్పందం మరింత ఊతమివ్వగలదని సంస్థ సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు.  

మరిన్ని పెట్టుబడులు .. 
ఎయిరిండియా భారీ విస్తరణ, కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైతే 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్‌ఐఏ, టాటా సన్స్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. ‘విలీనానంతరం మాకు ఉండే 25.1 శాతం వాటా ప్రకారం మేము అదనంగా రూ.5,020 కోట్ల వరకూ ఇన్వెస్ట్‌ చేయాల్సి రావచ్చు. విలీనం పూర్తయ్యాకే చెల్లించాల్సి ఉంటుంది‘ అని ఎస్‌ఐఏ తెలిపింది.

టాటా గ్రూప్‌లో నాలుగు ఎయిర్‌లైన్స్‌.. 
టాటా గ్రూప్‌లో ప్రస్తుతం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ఏషియా ఇండియా, విస్తారా అని నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఏడాది జనవరిలోనే కొనుగోలు చేసింది. ఎయిర్‌ఏషియా ఇండియా 2014లో, విస్తారా 2015లో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 2005లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రస్తుతం విస్తారా, ఎయిరిండియా దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అక్టోబర్‌లో రెండింటి మార్కెట్‌ వాటా కలిపి 18.3 శాతంగా ఉంది. ఎయిర్‌ఏషియాతో కలిపితే 25.9 శాతంగా ఉంది. ఎయిరిండియాలో విలీనంతో విస్తారా బ్రాండ్‌ కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది.  

ఎనిమిదేళ్ల విస్తారా..  
తాము స్థాపించిన ఎయిరిండియా.. ప్రభుత్వం చేతికి చేరాక, టాటా గ్రూప్‌ దశాబ్దాల పాటు తిరిగి విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించేందుకు 1994లో ప్రయత్నించినా కుదరలేదు. ఆరేళ్ల తర్వాత ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసి ఏవియేషన్‌లోకి ప్రవేశిద్దామనుకున్నా సాధ్యపడలేదు. చివరికి 2012లో ఏవియేషన్‌లో విదేశీ పెట్టుబడులపై పరిమితులను సడలించడంతో మళ్లీ ఎస్‌ఐఏతోనే జత కట్టి ఎట్టకేలకు 2015లో విస్తారా విమానయాన సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా విమానయాన మార్కెట్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విస్తారా దేశీ, విదేశీ రూట్లలో 41 ప్రాంతాలకు రోజూ 260 పైగా ఫ్లైట్లు నడుపుతోంది. 54 విమానాలు, దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు.   

  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top