Stock Market: కరెక్షన్‌ కొనసాగొచ్చు | Sakshi
Sakshi News home page

Stock Market: కరెక్షన్‌ కొనసాగొచ్చు

Published Mon, Oct 25 2021 4:08 AM

stock movement on termination of F and O contracts - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్‌ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్‌ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  ‘‘బ్యాంక్‌ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది.

అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవ్వొచ్చు. ఎఫ్‌అండ్‌ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్‌(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్‌ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సరీ్వసెస్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా తెలిపారు.
    
వరుస నాలుగు రోజుల పతనంతో  గతవారం సెన్సెక్స్‌ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి.  

క్యూ2 ఫలితాల జాబితా...
సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.  
ఇందులో బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ తదితర కంపెనీలున్నాయి.

ఈ వారంలో రెండు ఐపీఓలు...  
బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్‌ బ్యాంక్స్‌ ఈ వారం పబ్లిక్‌ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్‌లోకి రానున్నాయి. ఫినోటెక్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్‌ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది.

ఎఫ్‌ఐఐల ట్రెండ్‌ రివర్స్‌...  
గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్‌ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్‌ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్‌ మార్కెట్‌లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

ఐటీ షేర్ల పట్ల బేరిష్‌ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్‌ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్‌లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్‌ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్‌ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్‌ కుమార్‌ తెలిపారు.  

 28 నుంచి నైకా ఐపీవో
షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125
సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ–కామర్స్‌ వెంచర్స్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 28న ప్రారంభమై నవంబర్‌ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్‌హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్‌ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement