ఇరాన్ సంక్షోభంతో మార్కెట్ల భారీ ఊగిసలాట
ఇప్పటికే దాదాపుగా 7–8 శాతం పతనమైన మార్కెట్లు
సంక్షోభం తీవ్రమైతే ముడి చమురు ధరలు మరింత భగ్గుమనే చాన్స్
1990 గల్ఫ్ యుద్ధంతో మొదలెడితే సంక్షోభాలన్నిటా ఇదే తీరు
కానీ ప్రతి పతనం తరువాత మరింత వేగంగా పెరుగుతున్న మార్కెట్లు
దీర్ఘకాల ట్రెండ్ ఎప్పుడూ ముందుకేనంటున్న నిపుణులు
నష్టాల్లో ఉండి అమ్మకాలు వద్దు... వేచి చూస్తేనే మేలని సూచన
దిగువ స్థాయిల్లో ఉన్నపుడు సిప్ కొనసాగించటమే మంచిది
గల్ఫ్ అంటేనే చమురు మార్కెట్‌కు హృదయం లాంటిది. అలాంటి గల్ఫ్‌లో పెద్ద దేశంగా చెలామణి అవుతున్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లనే కాదు... స్టాక్ మార్కెట్లనూ అతలాకుతలం చేస్తున్నాయి. దేశానికి కావలసిన ముడి చమురులో 88 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్‌పైనా ఈ ప్రభావం పడుతోంది. మార్కెట్లు అనూహ్యంగా కదులుతున్నాయి. సూచీలు రోజూ 1–2 శాతం పడటం... కొంత రికవరీ కావటం జరుగుతోంది. ఇక కొన్ని షేర్లయితే దారుణంగా పడ్డాయి.
ఐటీ సహా పలు షేర్లు మూడేళ్ల కనిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ల నుంచి విత్‌డ్రా అయి సురక్షిత సాధనాలవైపు మళ్లాలా? లేక మరికొంత ఇన్వెస్ట్ చేయాలా? సిప్‌లు ఆపేయాలా? కొనసాగించాలా? అసలు యుద్ధ ప్రభావం ఎన్నాళ్లుంటుంది? గతంలో యుద్ధాలు జరిగినపుడు మార్కెట్లు ఎలా స్పందించాయి? ఎన్నాళ్లకు కోలుకున్నాయి? వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లకు అవగాహన కలిగించడానికే ఈ ‘వెల్త్’ స్టోరీ...
భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లవైపు వెళ్లటం పెరిగిన నాటి నుంచీ... అంటే 1990ల నుంచీ చాలా యుద్ధాలు, సంక్షోభాలు వచ్చాయి. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పటి ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ వరకూ పలు యుద్ధాలతో పాటు.. కోవిడ్ వంటి అంతర్జాతీయ సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినపుడు మార్కెట్లు తక్షణ స్పందనగా పతనమయ్యాయి. ఆ పతనం కొన్ని సార్లు భారీగా ఉంటే... మరికొన్నిసార్లు తక్కువగానే కనిపించింది. కోలుకోవటానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడితే... కొన్నిసార్లు వేగంగానే రికవరీ అయ్యాయి. మరో అద్భుతం ఏంటంటే ప్రతి యుద్ధం... ప్రతి సంక్షోభం ఓ కొత్త చరిత్రకు మార్గం చూపించింది.
1991 గల్ఫ్ యుద్ధం: సంస్కరణలకు మార్గం
గల్ఫ్ యుద్ధ సమయంలో చమురు ధరలు 17 డాలర్ల నుంచి 36 డాలర్లకి ఎగబాకాయి. అంటే రెట్టింపుకన్నా ఎక్కువ. పైపెచ్చు మన దగ్గర చాలినంత విదేశీ కరెన్సీ నిల్వలు లేవు. దీంతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురయింది. సెన్సెక్స్ సుమారు 21శాతం పతనమైంది. అయితే ఇదే సమయంలో భారతదేశంలో కొత్త చరిత్ర మొదలైంది. నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తెచ్చింది. ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా కొత్త భారతదేశం ఆవిష్కృతమయ్యింది. 1990ల చివరినాటికి మార్కెట్ కొన్ని రెట్లు పెరిగింది.
2000 డాట్‌కామ్ బబుల్: సుదీర్ఘ రికవరీ
ఇంటర్నెట్ కంపెనీలు పుట్టగొడుగులుగా వచ్చి... వాటికి సరైన ఆదాయ మార్గాలు లేకపోవటంతో మూతపడాల్సి వచ్చిన సమయమది. డాట్‌కామ్ బుడగ బద్దలయింది. కంపెనీలు మూతపడ్డాయి. ఈ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 6,150 పాయింట్ల నుంచి 2,594 పాయింట్లకి పడిపోయింది. రికవరీకి రెండున్నరేళ్లకు పైగానే (దాదాపు 850 రోజులు) పట్టింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సాగిన రికవరీ ఇది.
అయితే ఈ కాలంలో ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటం... ద్రవ్యపరంగా క్రమశిక్షణ పాటించటం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిచ్చాయి. 2004 తర్వాత మళ్లీ బలమైన బుల్ రన్ ప్రారంభమైంది. మార్కెట్ల రికవరీని పక్కనబెడితే... డాట్‌కామ్ విప్లవం వల్ల ప్రపంచాన్ని కనెక్ట్ చేసే బలమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పడింది. సముద్రగర్భ కేబుళ్లతో పాటు విస్తృతమైన నెట్‌వర్క్ వచ్చింది. అది తరువాతి కాలంలో ప్రపంచ గతినే మార్చేసింది.
2008 ఆర్థిక మాంద్యం: భారీ పతనం
అమెరికాలో సబ్‌ప్రైమ్ సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసిన సమయమది. లేమన్ బ్రదర్స్‌తో మొదలుపెట్టి పలు ఆర్థిక సంస్థలు అప్పులు రికవరీ అయ్యే పరిస్థితి లేక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆర్థిక దిగ్గజాలు బోర్డు మూసేశాయి. పొదుపుపై నిలబడ్డ భారత వ్యవస్థ దేశంలో ఏ ఆర్థిక సంస్థా కుప్పకూలకుండా కాపాడినా... భారత్‌కు కూడా మాంద్యం తాకిడి తప్పలేదు.
ఫలితంగా సెన్సెక్స్ 21,206 పాయింట్ల నుంచి 7,697 పాయింట్లకు పతనమైంది. అంటే దాదాపు 64% పతనం. అప్పట్లో స్టాక్ మార్కెట్ యుగం ముగిసినట్టే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆర్‌బీఐ లిక్విడిటీ మద్దతు, ప్రభుత్వ ఆరి్ధక ఉద్దీపన ప్యాకేజీలు, ఇన్‌ఫ్రా పెట్టుబడులు మార్కెట్‌కు మళ్లీ ఊపిరి పోశాయి. 750 రోజుల్లో సెన్సెక్స్ తిరిగి పాత గరిష్ట స్థాయికి చేరింది. ఈ సంక్షోభం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో స్రూ్కటినీని పెంచటంతో పాటు కొత్త పెట్టుబడి సాధనాలకు మార్గం చూపించింది.
2020 కోవిడ్: వేగవంతమైన రికవరీ
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేయటంతో అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ప్రపంచం లాక్‌డౌన్ అయింది. సెన్సెక్స్ 39 శాతం పతనమైంది. కానీ కేవలం 230 రోజుల్లోనే తిరిగి పాత గరిష్ఠ స్థాయిని చేరుకుంది. కాకపోతే ఈ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్‌వైపు నడిపించింది. సోషల్ మీడియాను కొత్త శిఖరాలకు చేర్చింది. పేమెంట్ల వ్యవస్థను, కార్యాలయాల్లో పనిచేసే పద్ధతిని సమూలంగా మార్చేసింది. ఇప్పుడు చూస్తున్న చాలా మార్పులు కోవిడ్ ఫలితమేనంటే అతిశయోక్తి కాదు.
2022 రష్యా– ఉక్రెయిన్ యుద్ధం: ద్రవ్యోల్బణ షాక్
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగటంతో ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్ల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు 8 శాతం దాకా పతనమయ్యాయి. అయితే దేశం 6 నెలల్లో ఈ యుద్ధ ప్రభావం నుంచి కోలుకోగలిగింది. ఉక్రెయిన్ ఉద్రిక్తత కారణంగా భారత్ తన సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చుకుంది. గ్లోబల్ యుద్ధాల్లో నిలబడే శక్తిని సమకూర్చుకుంది.
2023–2026 అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలు
పది రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా ఖమేనీని క్షిపణి దాడులతో హతమార్చాయి. ఇరాన్ ప్రతి దాడులకు దిగటంతో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసింది. ఈ యుద్ధం ఫలితంగా ముడి చమురు ధరలు గడిచిన వారం రోజుల్లోనే 36 శాతం వరకూ పెరిగాయి. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువే కావటంతో స్టాక్ మార్కెట్లు విపరీతంగా ఊగిసలాటకు గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నారు. ఈ యుద్ధం ఆరంభానికి ముందు 26,300 పాయింట్లను తాకిన నిఫ్టీ... దాదాపు 1,800 పాయింట్లు నష్టపోయింది. అంటే దాదాపు 7 శాతం పతనమైంది. యుద్ధం ఇంకా కొనసాగుతోంది.
భారత్‌పై యుద్ధ ప్రభావాలు ఒకప్పటిలా ఉండే అవకాశం తక్కువ, ఎందుకంటే..
⇒ సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా భారీ ఫారెక్స్ రిజర్వులున్నాయి.
⇒ పొదుపు ఆధారితం నుంచి వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది.
⇒ రూపాయి కదలికలను – లిక్విడిటీని నియంత్రించే సామర్థ్యం రిజర్వ్‌బ్యాంకుకు ఉండడం.
⇒ దేశీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
సంక్షోభాల గురించి స్టాక్‌మార్కెట్లు చెబుతున్నదొకటే. పతనం తాత్కాలికం. ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంటే మార్కెట్లూ పెరుగుతాయి. నిపుణుల సూచన ప్రకారం... ఇప్పటికే మార్కెట్లు కొంత పడ్డాయి. భారీగా లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు తాత్కాలికంగా కొంతవరకూ వెనక్కి తీసుకున్నా పర్వాలేదు. కానీ నష్టాల్లో వైదొలగటం అనేది సరైన నిర్ణయం కాదు. మార్కెట్ల పతనం అనేది మరింత పెట్టుబడులకు అవకాశంగానే భావించాలి తప్ప ఉపసంహరణకు కాదు. సిప్ చేస్తున్నవారు మార్కెట్లు మరింత పతనమైతే మరింత పెట్టుబడి పెట్టే మార్గాన్ని పరిశీలించుకోవాలి. దిగువ స్థాయిల్లో సిప్‌ను కొనసాగిస్తేనే మంచి లాభాలు కళ్లచూస్తారు.
యుద్ధాలు, సంక్షోభాలు ప్రతికూలం (నష్టపోయే రంగాలు)
⇒ ఏవియేషన్
⇒ ఆటోమొబైల్స్
⇒ కెమికల్స్
⇒ ఆయిల్ ఆధారిత పరిశ్రమలు
అనుకూలం (లాభపడే రంగాలు)
⇒ డిఫెన్స్ సంబంధిత కంపెనీలు
⇒ ఎఫ్‌ఎంసీజీ సంస్థలు
⇒ ఫార్మా కంపెనీలు
⇒ చమురు అన్వేషణ సంస్థలు
⇒ గోల్డ్ సంబంధిత పెట్టుబడులు


