
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు లాభపడి 25,114కు చేరింది. సెన్సెక్స్(Sensex) 28 ప్లాయింట్లు దిగజారి 82,415 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.24 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 67.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.09 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.31 శాతం పుంజుకుంది.
బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)