సూచీలకు మళ్లీ లాభాలు

Stock market: Sensex, Nifty end with healthy gains - Sakshi

నష్టాలు ఒకరోజుకే పరిమితం

ఫెడ్‌ నుంచి సానుకూల సంకేతాలు  

ఫైనాన్స్, మెటల్‌ షేర్లకు డిమాండ్‌

సెన్సెక్స్‌ లాభం 556 పాయింట్లు

18,250 పైకి నిఫ్టీ

ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్‌ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్‌ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

సెన్సెక్స్‌ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267  గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది.  ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్‌ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్‌ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్‌ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ ‘బై’ రేటింగ్‌తో ఫుడ్‌ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది.
► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.  
► అంచనాలకు మించి మార్చి క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top