
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం దూసుకెళ్లాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచింది. దాంతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించి మదుపర్లు ఉత్సాహంగా పెట్టుబడి పెట్టారు. మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఈ ఫలితాలు సహకరిస్తాయని అంచనాలు ఉన్నాయి. దాంతో సూచీలు ఆల్‌టైమ్ హైను చేరాయి.
సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరు కొనసాగించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 1.5 శాతం మేర లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఎన్నికల ఫలితాలతో పాటు భారీ జీఎస్టీ వసూళ్లు, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బలమైన జీడీపీ వృద్ధి రేటు, నవంబర్ వాహన విక్రయాల్లో గణనీయ వృద్ధి, బలమైన తయారీ కార్యకలాపాల వంటి అంశాలు సూచీల లాభాలకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1,100 పాయింట్లకు పైగా పెరిగి 68,634 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 20,619.70 దగ్గర రికార్డు స్థాయికి చేరింది.
బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.343 లక్షల కోట్లకు చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ విలువ రూ.14 లక్షల కోట్లకు పైగా ఎగబాకడం విశేషం. బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఇటీవలే నాలుగు లక్షల కోట్ల డాలర్ల కీలక మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల విలువ సైతం శుక్రవారం ఈ కీలక మైలురాయి దాటింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)