దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్‌ లింక్‌ సేవలు

Starlink To Focus on 10 Rural Constituencies For Broadband Connectivity - Sakshi

స్పేస్‌ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవల కోసం ‘స్టార్‌ లింక్‌’ పేరుతో ప్రాజెక్ట్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్‌ లింక్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు త్వరలోనే మనదేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలలో ప్రారంభించనున్నట్లు ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. స్టార్‌ లింక్‌ ప్రాజెక్టు కింద ఉపగ్రహాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. హాథోర్న్, కాలిఫోర్నియా ఆధారిత సంస్థ స్పేస్‌ఎక్స్‌ 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించాలని అంచనా వేసింది. 

రాబోయే భవిష్యత్తులో ఈ సేవలను కల్పించడానికి భారతదేశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం దేశంలోని పది గ్రామీణ లోక్ సభ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుందని ఇండియా స్టార్ లింక్ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఒక పోస్టులో తెలిపారు. శాసనసభ్యులు, మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశం కానున్నట్లు ఆయన సూచి౦చారు. దేశంలో స్టార్ లింక్ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి స్టార్‌లింక్‌ ఇండియా డైరక్టర్‌గా సంజయ్‌ భార్గవను స్పేస్‌ఎక్స్‌ నియమించింది. స్టార్ లింకు ప్రాజెక్టు కింద మొదట ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 2018లో స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!)

స్టార్ లింక్ ప్రస్తుతం 1,600కు పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటి ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, పోర్చుగల్, యుకె, యుఎస్ వంటి ఇతర 14 దేశాలలో బీటా టెస్టింగ్ కనెక్టివిటీ ప్రారంభించింది స్పేస్ ఎక్స్. స్టార్ లింక్ డిసెంబర్ 2022 నాటికి భారతదేశంలో 2 లక్షల మందికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 5,000 టెర్మినల్స్ కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కనెక్షన్‌ కోసం 99 డాలర్ల (సుమారు రూ.7,350) డిపాజిట్‌ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల విభాగంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్‌ నేరుగా పోటీపడనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top