ఎర్త్‌ - 2.0,‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’

South Korean Engineer Shaun Plans To Develop The Parcels Of Land   - Sakshi

కోడి కాని కోడి?
పకోడి.
బడి కాని కాని బడి?
రాబడి.
మరి భూమి కాని భూమి?

డిజిటల్‌ భూమి! అదేమిటి అంటారా? అయితే ఇది చదవాల్సిందే...

సౌత్‌ కొరియా యువ ఇంజనీర్‌ శౌన్‌ ఇటీవల భారీ మొత్తం వెచ్చించి విలువైన భూమి కొన్నాడు. ‘చాలా ప్లాన్స్‌ ఉన్నాయి. రకరకాల బిల్డింగ్స్‌ నిర్మించాలనుకుంటున్నాను. కె–పాప్‌ లైవ్‌పెర్‌ఫార్మెన్సెస్, కె–డ్రామా స్క్రీనింగ్‌ కోసం ఆడిటోరియమ్స్‌ కూడా నిర్మించాలనుకుంటున్నాను’ అంటున్నాడు శౌన్‌. ‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’ అని అడిగిచూడండి. ‘నగరంలో కాదండీ... దీనిలో ఉంది’ అని ల్యాప్‌ట్యాప్‌ ఓపెన్‌ చేయబోతే...‘ఏం ఎకసెక్కాలుగా ఉందా!’ అని సీరియస్‌ కానక్కర్లేదు. ఎందుకంటే అతడు అక్షరాలా అబద్ధం చెప్పలేదు. నిజంగానే నిజం చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటంటే...గోల్డ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్స్‌...కాలంతో పాటు పొదుపు మార్గాలు పెరుగుతుంటాయి. పొదుపు మార్గం అనాలో, ట్రెండ్‌ అనాలో తెలియదుగానీ ‘జెనరేషన్‌ ఎంజెడ్‌’ (మిలియనల్స్‌ అండ్‌ జెనరేషన్‌ జెడ్‌) వర్చువల్‌ ల్యాండ్‌పై దృష్టి పెడుతుంది.శౌన్‌ విషయానికి వస్తే అతడు డిసెంట్రల్యాండ్‌లో భూమి కొన్నాడు.

ఏమిటీ డిసెంట్రల్యాండ్‌?

డిసెంట్రలైజ్‌డ్‌ 3డీ వర్చువల్‌ రియాలిటీ ప్లాట్‌ఫామ్‌ ఇది. యూజర్లు ఈ డిజిటల్‌ భూభాగంలో భూములను కొనవచ్చు. వాటిని డెవలప్‌ చేయవచ్చు. అమ్మవచ్చు. క్రియేట్, ఎక్స్‌ప్లోర్‌ అండ్‌ ట్రేడ్‌...అంటుంది డిసెంట్రల్యాండ్‌! 

‘ఎర్త్‌–2’ కూడా ఇలాంటిదే. మ్యాప్‌బాక్స్‌ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్‌ ల్యాండ్‌ ఇది. భూగ్రహాన్ని డిజిటల్‌ గ్రిడ్‌ లేయర్స్, టైల్స్‌గా విభజిస్తారు. ఈ టైల్స్‌ విలువ యూఎస్‌లో ఒకరకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఇండియాలో ఒకరకంగా ఉంటుంది. దీన్ని డిజిటల్‌ ఎస్టేట్‌ అని కూడా పిలుస్తున్నారు.

‘వాస్తవిక ప్రపంచంలో భూములు, ఇండ్ల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. వాటిని కొనలేని నిరాశ నన్ను జియోలొకేషన్‌ బేస్డ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎర్త్‌–2పై ఆసక్తి పెరిగేలా చేసింది’ అంటున్నాడు సౌత్‌ కొరియాకు చెందిన  చౌయి అనే యువకుడు. ఇతడికి మిత్రుడైన వాంగ్‌ కెఔన్‌ పక్క దేశానికి ఎప్పుడు వెళ్లింది లేదు. అలాంటి వాంగ్‌ ఇప్పుడు సౌత్‌ కొరియాలోనే కాదు ఇరాన్, ఈజిప్ట్‌లలో భూములు కొన్నాడు...ఎర్త్‌–2లో!

‘మిగిలిన దేశాలకంటే సౌత్‌ కొరియా యూత్‌ మా ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి చూపుతుంది అంటున్నారు ఎర్త్‌–2 నిర్వాహకులు. ‘డిసెంట్రల్యాండ్‌’ కూడా ఇలాగే అంటుందిగానీ, తమ ల్యాండ్‌పై ఆదరణ ఇతరదేశాల్లోనూ పెరుగుతుందని చెబుతుంది.

ఏదో సినిమాలో చార్మినార్‌ను చూపించి ‘ఇది నాదే. ఇప్పుడు అమ్మేస్తున్నాను’ అని కమెడియన్‌ అంటే నవ్వుకున్నాం. డిజిటల్‌ ల్యాండ్‌లో చార్మినార్‌ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనావాల్‌లు నావే అంటున్నారు. వేలంవెర్రిగా కనిపిస్తున్న ఈ సోషల్‌ ట్రెండ్‌ కాలానికి నిలబడుతుందా? బుడగలా పేలుతుందా? కచ్చితంగా కాలమే చెబుతుంది.    

చదవండి : నైట్‌ఫ్రాంక్‌ హౌసింగ్‌ ర్యాంకింగ్‌ సర్వే.. భారత్‌లో ఇళ్ల రేట్లు తగ్గాయా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top