కొత్త ఫోన్ కొనుగోలుకు కొంతకాలం బ్రేకు
పండుగ సీజన్ విక్రయాల్లో 30% వరకు తగ్గే అవకాశం
ట్రాకిన్ టెక్, టెకార్క్ సర్వేలో ఆసక్తికర అంశాలు
స్మార్ట్‌ఫోన్‌ల ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. ధరలు దిగివచ్చే వరకు సగానికి పైగా మంది కొనుగోలును వాయిదా వేయగా, కొందరు సెకండ్‌హ్యాండ్ ఫోన్ల వైపు మళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ పరిస్థితి కొనసాగితే పండుగ సీజన్‌లో (జూలై–డిసెంబర్) దేశీయ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 30 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ట్రాకిన్ టెక్, టెకార్క్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్ధంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లలో 54% డిమాండ్ క్షీణించవచ్చు.
దేశవ్యాప్తంగా జూలై నుంచి డిసెంబర్ మధ్య స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని యోచిస్తున్న 5,958 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది ధరలు తగ్గే వరకు కొనుగోలును వాయిదా వేస్తామని, మరో 6 శాతం మంది సెకండ్‌హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ప్రస్తుత ధరల ధోరణి కొనసాగితే ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 115–120 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఈ సంఖ్య 136–138 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
మెమరీ చిప్‌ల ధరలే ప్రధాన కారణం
న్యాండ్ ఫ్లాష్, డీఆర్‌ఏఎం మెమరీ చిప్‌ల గ్లోబల్ ధరలు పెరగడం స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అని సర్వే పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్, వర్కింగ్ మెమరీ కోసం ఉపయోగించే ఈ చిప్‌ల ఖర్చు పెరగడంతో తయారీ వ్యయాలు అధికమయ్యాయి. ప్రత్యేకించి రూ.20 వేలలోపు ధరల విభాగంలో ఫోన్ల ధరలు సగటున 8–12% వరకు పె రిగాయి. ఈ విభాగంలో మెమరీ చిప్‌ల ఖర్చు మొత్తం తయారీ వ్యయంలో దాదాపు 40% వరకు ఉంటుంది.
ఊపందుకోనున్న ప్రీ–ఓన్డ్ మార్కెట్
ధరల పెరుగుదల ప్రభావంతో ప్రీ–ఓన్డ్, రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు గణనీయమైన ఆదరణ లభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. సెకండ్‌హ్యాండ్ ఫోన్ల వైపు మళ్లే 6% మంది వినియోగదారులు అదనంగా 60–70 లక్షల యూనిట్ల డిమాండ్‌ను సృష్టించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం 23–25 మిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న ఈ మార్కెట్ ఏడాది 30–32 మిలియన్ యూనిట్లకు పెరగవచ్చని టెకార్క్ వ్యవస్థాపకుడు ఫైసల్ కవూసా తెలిపారు.
ఫైనాన్స్ సదుపాయమూ సవాళ్లే..
స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లకు ఫైనాన్స్ సదుపాయాలు కూడా కఠినతరమవుతున్నాయని నివేదిక పేర్కొంది. వడ్డీ రేట్లు పెరగకపోయినా గతంలో రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్‌లు పెరగడం వల్ల రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కఠినతర విధానాలు అమలు చేస్తున్నాయి. అసంఘటిత వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే పలువురికి సరైన క్రెడిట్ స్కోర్ లేకపోవడంతో రుణ లభ్యత కష్టమవుతోంది. ‘‘భారతీయ వినియోగదారులు మెరుగైన స్మార్ట్‌ఫోన్‌లను కోరుకుంటున్నారు. అయితే అందుబాటు ధర ఉండాలని ఆశిస్తున్నారు. ధరలు మరింత పెరిగితే కొనుగోళ్లు వాయిదా వేయడం, సర్దుకుపోవడం, ఫైనాన్స్ ఆశ్రయించడం, సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మళ్లుతున్నారు. వినియోగదారుల గురించి అవగాహన ఉన్న స్థానిక రిటైలర్ల ద్వారా వినూత్న ఫైనాన్సింగ్ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ట్రాకిన్ టెక్ వ్యవస్థాపకుడు అరుణ్ ప్రభుదేశాయ్ పేర్కొన్నారు.
ధరల పెరుగుదలకు 3 ప్రధాన కారణాలు
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2025 జనవరి నుంచి 2026 మే వరకు ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించిందని అధ్యయనం పేర్కొంది. కృత్రిమ మేధ (ఏఐ) సంస్థల భారీ పెట్టుబడుల కారణంగా మెమరీ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏడాదిలో 5 శాతం మేర బలహీనపడటం, అలాగే ప్రముఖ బ్రాండ్లు లాభదాయకత పెంపుపై దృష్టి సారిస్తూ అధిక సగటు విక్రయ ధరల (ఏఎస్‌పీ) వ్యూహాన్ని అనుసరించడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని అధ్యయం విశ్లేషించింది.
ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!


